...
...
Next Story

తొలి ఏకాదశి వ్రత కథ.. అందరూ తెలుసుకోవాల్సిన పురాణ గాథ.. శ్రీహరి మహిమ ఇదే!

దేవశయని (తొలి) ఏకాదశి విశిష్టత, చాతుర్మాస్య ప్రారంభం, శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశించే ఈ పవిత్ర తిథి వెనుక ఉన్న మాంధాత చక్రవర్తి పురాణ కథ, మహర్షి అంగీరసుడి ఉపదేశం, దేవశయని ఏకాదశి వ్రత మహిమ, శ్రీహరి అనుగ్రహంతో కరువు తొలగి రాజ్యం సుభిక్షంగా మారిన దివ్య గాథ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Jul 24, 2026, 16:00:40 IST
Advertisement

హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే 'దేవశయని ఏకాదశి'కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది జూలై 25, 2026 శనివారం రోజున ఈ పవిత్ర వ్రతం వచ్చింది. ఈ ఏకాదశితోనే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీరాసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే ఈ సమయం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనువైనదిగా భావిస్తారు.

తొలి ఏకాదశి వ్రత కథ.. అందరూ తెలుసుకోవాల్సిన పురాణ గాథ.. శ్రీహరి మహిమ ఇదే!
తొలి ఏకాదశి వ్రత కథ.. అందరూ తెలుసుకోవాల్సిన పురాణ గాథ.. శ్రీహరి మహిమ ఇదే!

వ్రత ప్రాముఖ్యత గురించి ఒకసారి ధర్మరాజు యుధిష్టరుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించగా, బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన దివ్య కథను శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. సమస్త పాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదించే ఈ ఏకాదశి వెనుక ఉన్న పురాణగాథ ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం.

మాంధాత చక్రవర్తి

పురాతన కాలంలో మాంధాత అనే చక్రవర్తి భూలోకాన్ని పరిపాలించారు. ఆయన సత్యసంధుడు, ధర్మపరాణుడు, మహా ప్రతాపశాలి. తన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన సాగింది. ఆయన రాజ్యంలో ప్రజలు ఎలాంటి ఆకలిదప్పులు లేకుండా సుభిక్షంగా ఉండేవారు. వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల ఆ రాజ్యంలో ఎప్పుడూ అరుదైన సిరులు విరాజిల్లాయి.

అయితే, ఒకసారి విధి విలాసంలాంటి విపత్తు ఆ ప్రభువును చుట్టుముట్టింది. వరుసగా మూడేళ్ల పాటు ఆ రాజ్యంలో ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. దీని వల్ల రాష్టమ్రంతా భయంకరమైన అకాలం తాండవించింది. అన్నపానీయాలు కరవయ్యి ప్రజలు విలవిలలాడిపోయారు. నీరు లేక యజ్ఞ యాగాదులు, పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయి.

ప్రజల ఆవేదన..

కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజలు ఒక్కసారిగా రాజు వద్దకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. "రాజా! సృష్టికి మూలం వర్షం. వానలు పడక మేమంతా ఆకలితో అల్లాడిపోతున్నాము. ఈ విపత్తు నుంచి మమ్మల్ని రక్షించే ఏదైనా మార్గాన్ని చూపండి" అని వేడుకున్నారు.

దట్టమైన అడవుల్లో ప్రయాణిస్తూ రాజు మాంధాత బ్రహ్మదేవుని కుమారుడైన మహర్షి అంగీరసుని ఆశ్రమానికి చేరుకున్నారు. గుర్రం దిగి మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. రాజా ఆగమనానికి కారణం ఏమిటని మహర్షి ఆరా తీయగా, మాంధాత తన గోడును వెళ్లబోసుకున్నారు.

"మహర్షీ! నేను ధర్మబద్ధంగానే రాజ్యాన్ని పాలిస్తున్నాను. అయినప్పటికీ నా రాజ్యంలో మూడేళ్లుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది. రాజ పాపాల వల్లే ప్రజలు కష్టాలు పడతారంటారు. మరి నా రాజ్యంలో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో నాకు మార్గదర్శనం చేయండి" అని వినయంగా కోరారు.

అకాలం నుంచి విముక్తికి మార్గం

రాజు దీనగాథను ఆలకించిన మహర్షి అంగీరసుడు దివ్య దృష్టితో పరిశీలించి ఒక పరిష్కారం చెప్పారు. "రాజా! ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే దేవశయని (హరిశయని) ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను పోగొట్టి, సకల సిద్ధులను ప్రసాదిస్తుంది. మీ మంత్రులు, ప్రజలతో కలిసి మీరు ఈ ఏకాదశి వ్రతాన్ని విధివిధానంగా ఆచరించండి. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో మీ రాజ్యంలో కుండపోత వర్షాలు కురుస్తాయి" అని భరోసానిచ్చారు.

వెల్లువెత్తిన వానలు.. కళకళలాడిన రాజ్యం

మహర్షి అంగీరసుడు చెప్పిన విధానం తెలుసుకున్న రాజు మాంధాత వెంటనే రాజధానికి తిరిగి వచ్చారు. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున తన మంత్రులు, ప్రజలతో కలిసి అత్యంత భక్తిశ్రద్ధలతో దేవశయని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, శ్రీహరిని పూజించారు.

ఆ దైవిక పూజా ప్రభావం తక్షణమే కనిపించింది. వ్రతం పూర్తయిన వెంటనే ఆ రాజ్యంలో ఆకాశం మేఘావృతమై ముసలాధార వర్షం కురిసింది. ఆ వానతో నేల తడిసి, ప్రతి ఇంటా పచ్చదనం వెల్లివిరిసింది. నీటి ఎద్దడి తీరిపోయి, పంటలు బాగా పండటంతో మాంధాత రాజ్యం మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe