Varuthini Ekadashi 2026: ఈరోజే వరూధిని ఏకాదశి.. మీ రాశి ప్రకారం ఇవి దానం చేస్తే సిరిసంపదలు!
వరూధిని ఏకాదశి నాడు పన్నెండు రాశులు పాటించాల్సిన పరిహారాలు: చైత్ర మాసంలో వచ్చే అత్యంత శక్తివంతమైన వరూధినీ ఏకాదశికి హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది. 2026 ఏప్రిల్ 13న ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? రాశిని బట్టి శ్రీహరి అనుగ్రహం పొందే మార్గాలేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలలో వచ్చే కృష్ణ పక్షం, శుక్ల పక్ష ఏకాదశి తిథులు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో చైత్ర మాస కృష్ణ పక్షంలో వచ్చే 'వరూధినీ ఏకాదశి'కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజున భక్తిశ్రద్ధలతో శ్రీహరిని పూజిస్తే కష్టాలు తొలగిపోవడమే కాకుండా, అపారమైన సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఈ ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి, మీ రాశి ప్రకారం ఏ వస్తువులను దానం చేస్తే అదృష్టం వరిస్తుందో క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

ముహూర్తం, తిథి వివరాలు
జ్యోతిష్య గణన ప్రకారం, 2026లో వరూధిని ఏకాదశి తిథి ఏప్రిల్ 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున సుమారు 1:17 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు, అంటే ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 1:08 గంటల వరకు తిథి ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఉదయ తిథికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, భక్తులు ఏప్రిల్ 13 సోమవారం నాడే ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి, అని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక వ్రతాన్ని విరమించే సమయం ఏప్రిల్ 14 మంగళవారం ద్వాదశి తిథిలో చేయాల్సి ఉంటుంది.
వరూధిని ఏకాదశి నాడు పన్నెండు రాశులు పాటించాల్సిన పరిహారాలు
వరూధిని ఏకాదశి నాడు మీ రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం త్వరగా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ వివరాలు మీ కోసం.
మేష రాశి: ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ఎర్రటి పూలతో పూజ చేయండి. దీని వల్ల కుటుంబంలో కలహాలు తొలగి సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
వృషభ రాశి: స్వామివారికి తెల్లని వస్తువులను (పాలు లేదా పెరుగు వంటివి) నైవేద్యంగా సమర్పించండి. దీని వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మిథున రాశి: ఆకుపచ్చని వస్త్రాలను సమర్పించండి. మీరు చేసే పనుల్లో ఏడాది పొడవునా ఆటంకాలు లేకుండా విజయాలు వరిస్తాయి.
కర్కాటక రాశి: విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా పెట్టండి. పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి.
సింహ రాశి: ఈ రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించండి. దేవుడికి కూడా పసుపు వస్త్రాలను సమర్పించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తుంది.
కన్యా రాశి: స్వామివారికి తెల్లని మిఠాయిలు, కుంకుమపువ్వు సమర్పించండి. దీని వల్ల మీకున్న రుణ బాధలు తగ్గుముఖం పడతాయి.
తులా రాశి: పాలు, బియ్యం వంటి తెల్లని వస్తువులను పేదలకు దానం చేయండి. ఇది దాంపత్య జీవితంలో అనురాగాన్ని పెంచుతుంది.
వృశ్చిక రాశి: బెల్లం దానం చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పురోగతి కనిపిస్తుంది.
ధనుస్సు రాశి: పసుపు వస్త్రాలు, పసుపు చందనం స్వామికి సమర్పించి పసుపు రంగు పండ్లను దానం చేయండి. దీనివల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
మకర రాశి: విష్ణువుకు పెరుగు, యాలకులను నైవేద్యంగా సమర్పించండి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి.
కుంభ రాశి: రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. లక్ష్మీ నారాయణుల కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.
మీన రాశి: పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. స్వామికి పటిక బెల్లం నైవేద్యంగా పెట్టడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


