Vastu: ఇంట్లో సాలీడు గూళ్లు కనిపిస్తున్నాయా? ఈ 3 చోట్ల ఉంటే మాత్రం మీ దరిద్రాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టే!
Vastu: ఇంటి మూలల్లో సాలీడు గూళ్లు కనిపిస్తే చాలా మంది "తరువాత శుభ్రం చేద్దాంలే" అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, ఆ గూళ్లు మన ప్రగతిని అడ్డుకునే ఉచ్చులని మీకు తెలుసా? ముఖ్యంగా ఇంటిలోని ఈ మూడు కీలక ప్రదేశాల్లో సాలీడు గూళ్లు ఉంటే ఆర్థిక కష్టాలతో పాటు మానసిక ప్రశాంతత కరువవుతుంది.
సాధారణంగా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు గోడల మూలల్లోనో లేదా అటకల పైనో సాలీడు గూళ్లు (Spider Webs) కనిపిస్తూనే ఉంటాయి. "రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం" అని మనం చేసే ఆలస్యం, మన జీవితంలోకి ప్రతికూల శక్తిని (Negative Energy) ఆహ్వానించినట్టే అవుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, సాలీడు గూడు అనేది కేవలం ఒక జంతువు కట్టుకున్న నివాసం మాత్రమే కాదు, అది ఇంట్లోని సానుకూల శక్తిని బంధించే ఒక ఉచ్చు వంటిది.

వాస్తు సిద్ధాంతాల ప్రకారం, ఇంట్లో గాలి, వెలుతురు ఎంత స్వేచ్ఛగా ప్రసరించాలో, శక్తి కూడా అంతే వేగంగా ప్రవహించాలి. సాలీడు గూళ్లు ఉన్న చోట శక్తి ప్రవాహం ఆగిపోతుంది. దీనివల్ల ఇంట్లో ఉండేవారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడటం, అనారోగ్యం పాలవ్వడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ మూడు ప్రదేశాల్లో సాలీడు గూళ్లు ఉండటం అస్సలు మంచిది కాదు.
వంటగదిలో గూళ్లు: ఆర్థిక సంక్షోభానికి సంకేతం
మన సంస్కృతిలో వంటగదిని సాక్షాత్తు అన్నపూర్ణా దేవి నిలయంగా భావిస్తాం. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత అభివృద్ధి ఉంటుందని పెద్దలు చెబుతారు. వాస్తు ప్రకారం, వంటగదిలో సాలీడు గూళ్లు ఏర్పడితే అది నేరుగా మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. లక్ష్మీదేవి కొలువై ఉండే చోట అపరిశుభ్రత ఉంటే ఆదాయ మార్గాలు మూసుకుపోతాయి. సంపాదించిన ధనం నిలవకపోవడం, అనవసరపు ఖర్చులు పెరగడం వంటివి సంభవిస్తాయి. అందుకే కిచెన్ క్యాబినెట్స్ వెనుక లేదా మూలల్లో గూళ్లు ఉంటే వెంటనే తొలగించాలి.
బెడ్‌రూమ్‌లో ఉంటే: మానసిక ఒత్తిడి, కలహాలు
రోజంతా కష్టపడి పని చేసిన తర్వాత మనం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే చోటు బెడ్‌రూమ్. ఇక్కడ ఉండే శక్తి మన మనస్సును, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో సాలీడు గూళ్లు ఉంటే ఆ ప్రదేశంలో 'నెగటివిటీ' పేరుకుపోతుంది. దీనివల్ల దంపతుల మధ్య అనవసరమైన మనస్పర్థలు రావడం, నిద్రలేమి, మనసులో తెలియని ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి. బెడ్‌రూమ్‌లో గూళ్లు ఉండటం వల్ల మన ఆలోచనా సరళి కూడా భారంగా మారుతుందని జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు.
పూజ గదిలో అస్సలు ఉండకూడదు
ఇంటి మొత్తానికి శక్తినిచ్చే కేంద్రం పూజ గది. ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం. దైవ ప్రార్థనలు చేసే చోట సాలీడు గూళ్లు ఉంటే, మీరు చేసే పూజల ఫలితం మీకు అందదు. ఇంట్లోని సానుకూల ప్రకంపనలు తగ్గిపోతాయి. పూజ గదిలో గూళ్లు ఉండటాన్ని తీవ్రమైన వాస్తు దోషంగా పరిగణిస్తారు. ఇది మానసిక విచారానికి, ఇంట్లో అశాంతికి దారితీస్తుంది. దేవుడి పటాల వెనుక లేదా మూలల్లో తరచూ గూళ్లను శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి శుభ ఫలితాలు వస్తాయి.
సాలీడు గూళ్లు కేవలం ఇంటి అందాన్ని చెడగొట్టడమే కాదు, అవి మన ప్రగతిని అడ్డుకునే దరిద్రానికి చిహ్నాలు. వారానికి కనీసం ఒక్కసారైనా ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, ఎక్కడా దుమ్ము, ధూళి, గూళ్లు లేకుండా చూసుకోవడం వల్ల వాస్తు దోషాల నుంచి బయటపడవచ్చు. గుర్తుంచుకోండి, శుభ్రత ఎక్కడ ఉంటే శుభం అక్కడ ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


