MMTS Stations Hyderabad : నగరంలో మరో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు…! ఎక్కడెక్కడ రాబోతున్నాయంటే…?
MMTS Stations Hyderabad :హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ నెట్‌వర్క్ మరింత విస్తరించనుంది. ప్రయాణికుల డిమాండ్ మేరకు అల్వాల్ లయోలా కాలేజీ, ఆనంద్‌బాగ్, మౌలాలీ వద్ద కొత్త స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ పనులు పట్టాలెక్కుతాయి.
MMTS Stations Hyderabad :హైదరాబాద్ నగరంలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత చౌకైన, వేగవంతమైన రవాణా మార్గమైన ఎంఎంటీఎస్ (MMTS) సేవలు మరింత విస్తరించబోతున్నాయి. నగరంలోని ప్రధాన శివారు ప్రాంతాల నుంచి పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని…. మరో మూడు కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎక్కడెక్కడ రాబోతున్నాయంటే…?
అల్వాల్‌లోని లయోలా కళాశాల సమీపంతో పాటు ఆనంద్‌బాగ్, మౌలాలీ ప్రాంతాల్లో ఈ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రతిపాదనలకు సంబంధించి తుది నివేదికను రైల్వే బోర్డు ఆమోదానికి పంపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
- ఘట్‌కేసర్-సనత్‌నగర్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో కొత్త స్టేషన్ల అవసరం పెరిగింది. వాస్తవానికి పదేళ్ల క్రితమే ఈ సెక్షన్‌లో కొన్ని స్టేషన్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. అల్వాల్ లయోలా కాలేజీ పరిసరాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు నివసిస్తున్నారు. ప్రయాణికుల సంఘాల విజ్ఞప్తి మేరకు డివిజనల్ రైల్వే మేనేజర్ స్వయంగా లెవెల్ క్రాసింగ్‌లను సందర్శించి…. నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఇక్కడ స్టేషన్ ఏర్పాటైతే అల్వాల్, బొల్లారం ప్రాంత వాసులకు ఎంతో మేలు జరుగుతుంది.
- సబర్బన్ రైల్వే నిబంధనల ప్రకారం కనీసం ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక రైల్వేస్టేషన్ ఉండాలి. కానీ….. చర్లపల్లి నుంచి నేరేడ్‌మెట్ వరకు సుదీర్ఘ మార్గంలో ఒక్క స్టేషన్ కూడా లేదు. దీంతో మల్కాజిగిరి, ఆనంద్‌బాగ్ వాసులు నిజామాబాద్ లేదా చర్లపల్లి మార్గంలో వెళ్లే రైళ్లు ఎక్కాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించి నేరేడ్‌మెట్ లేదా చర్లపల్లి స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. ఆనంద్‌బాగ్‌లో కొత్త స్టేషన్ నిర్మిస్తే ఈ ప్రాంత వాసుల ప్రయాణ అవస్థలు శాశ్వతంగా తప్పనున్నాయి.
- మౌలాలీలోని రైల్వే క్వార్టర్స్ సమీపంలో సుమారు 2 వేల నివాసాలు ఉన్నాయి. వీటితో పాటు చుట్టుపక్కల కాలనీల జనాభా కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడి వారు ఎంఎంటీఎస్ సేవలు పొందాలంటే దూరంగా ఉన్న స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. క్వార్టర్స్ సమీపంలోనే ఒక హాల్ట్ లేదా స్టేషన్ నిర్మిస్తే, స్థానికులు నేరుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది.
ఈ మూడు స్టేషన్ల నిర్మాణంతో ఎంఎంటీఎస్ రెండో దశ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. రైల్వే బోర్డు నుంచి అనుమతి రాగానే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. ఆ వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి…. పనులను వేగవంతం చేసే అవకాశాలుంటాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

