...
...
Next Story

Vikarabad : అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం - ప్రైవేట్ బస్సు బోల్తా, నలుగురు దుర్మరణం!

Vikarabad Ananthagiri Ghat Bus Accident : వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా పడి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్, కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Published on: Oct 3, 2026, 12:44:05 IST
Advertisement

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర రహదారి ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నియంత్రణ తప్పి తీవ్ర ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడటంతో అక్కడికక్కడే నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా… మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రైవేటు బస్సు బోల్తా
ప్రైవేటు బస్సు బోల్తా

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన బాధితులు వికారాబాద్ జిల్లా ధరూర్‌ మండలం చింతకుంట గ్రామంలో జరుగుతున్న బంధువుల అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు. మొత్తం 50 మందికిపైగా ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ క్రమంలో అనంతగిరి కొండ పైనుంచి కిందికి దిగుతున్న సమయంలో…. అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయ వైపు బోల్తా పడింది.

బస్సు బోల్తా పడటంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఏడుగురిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ప్రమాద వార్త తెలిసిన వెంటనే వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. క్షతగాత్రులను కాపాడేందుకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు.

సీఎం కీలక ఆదేశాలు…

ఈ దుర్ఘటనపై తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే అవసరమైన సహాయక చర్యలు అందించాలని సూచించారు.

అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బాధితులకు వైద్య సహాయం అందేలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks