...
...
Next Story

సచివాలయంలో ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశం.. ఢిల్లీకి వెళ్దామన్న డిప్యూటీ సీఎం భట్టి!

కరువుపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సచివాలయంలో ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చ జరిగింది.

Updated on: Oct 28, 2026, 22:28:48 IST
Advertisement

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల తలెత్తుతున్న కరువు ముప్పును అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధమైంది. ఈ తీవ్రమైన పరిస్థితిపై చర్చించేందుకు రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉన్నత స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజకీయ విమర్శలకు తావులేకుండా, ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా అఖిలపక్ష నేతలు అందించిన విలువైన సూచనలను ప్రభుత్వ కార్యాచరణలో పరిగణనలోకి తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశం
ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశం

ఈ అఖిలపక్ష భేటీకి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, రైతు కమిషన్ చైర్మన్, ఉన్నతాధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎల్. రమణ, బి. వినోద్ కుమార్, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, సీపీఎం నుంచి జాన్ వెస్లీ, జూలకంటి రంగారెడ్డి, టీజేఎస్ ప్రొఫెసర్ కోదండరాం హాజరు అయ్యారు.

కరువు నివారణ చర్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన సహాయాన్ని సాధించుకునేందుకు అవసరమైతే అన్ని పార్టీల నేతలతో కలిసి అఖిలపక్ష బృందంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా చూస్తామని, విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పశువులకు మంచినీరు, మేత లభించేలా చర్యలు చేపట్టడంతో పాటు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వల ఆధారంగా ప్రణాళికాబద్ధంగా జల నిర్వహణ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, భౌగోళిక నిపుణుల మార్గదర్శకాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు.

నదీ జలాల లభ్యత, వినియోగంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటినుంచే తీవ్రమైన మంచినీటి కొరత ఎందుకు ఏర్పడిందని ఎంఐఎం నేతలు మాట్లాడారు. నీటి ఎద్దడి వల్ల పంటలు వేయొద్దని చెబితే, బాధిత రైతులకు తగిన పరిహారం చెల్లించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతుల దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నందున రేషన్ షాపుల ద్వారా వాటిని అందించాలని ప్రతిపక్షాలు మాట్లాడాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks