...
...
Next Story

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్.. అధిష్ఠానం కీలక నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్ నియమితులయ్యారు. ఉన్నత చదువుల కోసం మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్లడంతో…. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో తక్షణమే ఈ మార్పు జరిగింది.

Published on: Nov 14, 2026, 20:21:39 IST
Advertisement

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి నియామకంపై కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తెరదించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్ ను నియమిస్తూ అధిష్ఠానం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో ఈ కీలక మార్పు చోటుచేసుకుంది.

విదేశాలకు మీనాక్షి నటరాజన్…

గత ఏడాది ఫిబ్రవరి 2025లో దీపా దాస్‌మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలంలో ఆమె రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వానికి-పార్టీకి మధ్య సమన్వయం సాధించడానికి కృషి చేశారు. అయితే, ఉన్నత చదువుల కోసం సుదీర్ఘ కాలం పాటు విదేశాలకు వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు. క్రియాశీలక సంస్థాగత బాధ్యతల నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలని ఆమె భావించడంతో, కొత్త ఇన్‌ఛార్జి నియామకం అనివార్యమైంది.

మీనాక్షి నటరాజన్ స్థానంలో తెలంగాణ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే దానిపై గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. కొత్త ఇన్‌ఛార్జి రేసులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మాణిక్‌రావు ఠాక్రే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అధిష్ఠానం బీఎం సందీప్‌పై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థాగత సవాళ్లను అధిగమిస్తూ, రాబోయే రాజకీయ పోరాటాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపై తెలంగాణలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించడంతో పాటు, రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేసుకునే బాధ్యత బీఎం సందీప్‌పై ఉంటుంది. మరోవైపు, 'భారత్ సమ్మిట్ 2026'లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks