డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ్టితో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
కోర్సుల వారీగా వివరాలు…

ఈ నోటిఫికేషన్ లో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ , బీకామ్ , బీఎస్సీ లతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఏ , ఎంకామ్, ఎంఎస్సీ , ఎంబీఏ , బీఎల్ఐఎస్సీ , ఎమ్ఎల్ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటితో పాటు పలు రకాల డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు కూడా సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఎస్సీ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఫీజులు చూస్తే…. మొదటి సంవత్సరం రూ. 3,200, ద్వితీయ సంవత్సరం రూ. 3,000, తృతీయ సంవత్సరం రూ. 3,000 ఉంటుంది. సైన్స్ విద్యార్థులకు ల్యాబ్ ప్రాక్టికల్ ఫీజు అదనంగా ఉంటుంది. (సైన్స్ సబ్జెక్టులకు రూ. 1,600, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌కు రూ. 800 చొప్పున, కంప్యూటర్ అప్లికేషన్స్‌కు రూ. 4,000 చొప్పున చెల్లించాలి.
అడ్మిషన్లు, ఫీజు చెల్లింపులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సమీపంలో ఉన్న విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాన్ని నేరుగా సంప్రదించవచ్చు. అలాగే యూనివర్సిటీ అధికారిక పోర్టల్ www.braouonline.in లేదా వెబ్‌సైట్ www.braou.ac.in లలో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉచిత కాల్ సెంటర్ నంబర్ 18005990101 లేదా సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 040-23680 222 / 333 / 555 లలో సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.