కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న వేళ, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వంపై ప్రజా పోరాటానికి సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఏడు రోజుల పాటు వినూత్న నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 2 నుండి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన బాట సాగనుంది.

పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి, వెయ్యి రోజులు దాటినా ప్రధాన వాగ్దానాలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. ఈ పాలనా వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయడమే బిఆర్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఏడు రోజుల ప్రత్యేక పోరాట ప్రణాళిక:
- సెప్టెంబర్ 1 (ఛార్జిషీట్ విడుదల) : వారం రోజుల నిరసనకు ముందే తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై బీఆర్ఎస్ అధిష్ఠానం ఒక సమగ్ర ఛార్జిషీట్‌ను విడుదల చేయనుంది.
- సెప్టెంబర్ 2 (ఆరు గ్యారెంటీలపై ధర్నాలు ): నియోజకవర్గ కేంద్రాల్లో ఆరు గ్యారెంటీల వైఫల్యంపై నిరసనలు తెలుపుతారు. ‘420 హామీల మోసం’ పేరుతో ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ… ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీల వివరాలతో ప్రచురించిన 'బాకీ కార్డుల'ను ప్రతీ ఇంటికీ పంపిణీ చేస్తారు.
- సెప్టెంబర్ 3 (రైతు సదస్సులు - 22ఎ భూముల నిరసన) : సాగునీరు, ఉచిత విద్యుత్, యూరియా కొరత, పంటల బీమా సమస్యలపై అన్ని నియోజకవర్గాల్లో రైతులతో చర్చా సదస్సులు నిర్వహిస్తారు. మరోవైపు హైదరాబాద్‌లో తీవ్రంగా వేధిస్తున్న 22ఏ నిషేధిత భూముల సమస్యపై బాధితులతో కలిసి ఆందోళన చేపడతారు.
- సెప్టెంబర్ 4 (మహిళలు, వికలాంగుల నిరసనలు) : నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, తులం బంగారం హామీలను విస్మరించడంపై మహిళలతో కలిసి నిరసనలు తెలుపుతారు. నియోజకవర్గ కేంద్రాల్లో వినూత్నంగా వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- సెప్టెంబర్ 5 (యువజన ర్యాలీలు) : జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్, యూత్ డిక్లరేషన్ అమలు చేయకపోవడంపై యువతతో భారీ ర్యాలీలు నిర్వహిస్తారు. సింగరేణి, ఆదిలాబాద్ సిసిఐ ప్రాంతాల్లో కార్మికుల సమస్యలపై ప్రత్యేక సదస్సులు ఉంటాయి.
- సెప్టెంబర్ 6 (నగర సమస్యలపై ఆటో ర్యాలీలు ): హైదరాబాద్‌లో డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, శాంతిభద్రతల లోపాలపై ఆటో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామాల్లో నిరసనలు తెలుపుతారు.
- సెప్టెంబర్ 7 (ప్రజావాణిలో పిటిషన్లు) : జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే ప్రజావాణి కేంద్రాలకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, 420 హామీల మోసంపై బీఆర్‌ఎస్ నాయకులు స్వయంగా ఫిర్యాదు లేఖలు సమర్పిస్తారు.
- సెప్టెంబర్ 8 (మీడియా సమావేశాలు - అంబేడ్కర్ నివాళులు): వారం రోజుల ఉద్యమ తీవ్రతను ప్రతి ప్రతినిధి తమ జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్ల ద్వారా వివరిస్తారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.
సెప్టెంబర్ 10న ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని కేటీఆర్ వెల్లడించారు. ప్రతి ఒక్క నాయకుడు ప్రజలతో మమేకమై ఈ ఏడు రోజుల కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
{{/usCountry}}సెప్టెంబర్ 10న ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని కేటీఆర్ వెల్లడించారు. ప్రతి ఒక్క నాయకుడు ప్రజలతో మమేకమై ఈ ఏడు రోజుల కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
{{/usCountry}}