సింగరేణిలో ఏ రకమైన జోక్యం, అధికారమూ కేంద్ర ప్రభుత్వానికి లేదు.. సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రం అనుమతి కావాలి : కిషన్ రెడ్డి
తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి ఇబ్బందులను ఎదుర్కొందన్నారు. సింగరేణిలో జోక్యం, అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు.
సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉన్నా.. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ రకమైన జోక్యం, అధికారమూ కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ముగ్గురు కేంద్రం నుంచి 7 గురు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోర్డు డైరెక్టర్లుగా ఉంటారని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో.. రాష్ట్రంలో పదేళ్లపాటు కల్వకుంట్ల ఫ్యామిలీ మాటే సింగరేణిలో చెల్లుబాటైందని వ్యాఖ్యానించారు.

సింగరేణిలో రాజకీయ జోక్యం
టెండర్ల దగ్గర్నుంచి.. చిన్న చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్ కుటుంబం ఆడింది ఆట అన్నట్లు సాగిందని ఆరోపించారు కిషన్ రెడ్డి. సింగరేణి కార్యక్రమాల్లో రాజకీయ జోక్యంతో సమస్యల్లోకి నెట్టేశారని తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.32వేల కోట్ల బకాయిలు పెట్టారన్నారు. ఎన్నిరకాలుగా సింగరేణిలో ఎంత విధ్వంసం చేయవచ్చో BRS అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని ఫాలో అవుతోందన్నారు.
బంగారు బాతుగా సింగరేణి
'తమ అవినీతి అక్రమాలకు.. సింగరేణిని బంగారు బాతుగా వాడుకున్నాయి. సింగరేణి కార్మికుల చెమట కష్టాన్ని దోచుకున్నాయి. ఒకప్పుడు బీఐఎఫ్ఆర్(బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్)లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణిని ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రూ.684 కోట్ల అప్పుపై మారిటోరియం విధించి సింగరేణిని కాపాడారు. తద్వారా సింగరేణి లాభాల బాటలో పడింది. కానీ 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చింది. అవినీతి అక్రమాలకు కేంద్రంగా మారిపోయింది.' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ కూడా అదే పద్ధతి
తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం.. సింగరేణి సంస్థకు నైని కోల్ బ్లాక్‌ను కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. 2015లోనే ఈ బ్లాక్ కేటాయించి.. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులను సరైన సమయంలో అందించిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైని కోల్ బ్లాక్ విషయంలో.. టెండర్లను ఆహ్వానించి.. ముఖ్యమంత్రి చివరి నిమిషంలో వెనక్కు తగ్గారన్నారు. ఇవాళ కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి వెనక్కు తగ్గిందని వ్యాఖ్యానించారు.
అనుమతులు వచ్చినా
'2024లో నేను బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. తర్వాత ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నైని కోల్ బ్లాక్‌కు సంబంధించి అనుమతులు వచ్చేలా చొరవతీసుకున్నాను. సహకార సమాఖ్య స్ఫూర్తితో.. 643 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి అప్పగించేందుకు ఆమోదముద్ర వేస్తూ.. 4 జూలై, 2024 నాడు ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైని బ్లాక్‌కు తుది అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనులను ప్రారంభించాల్సింది పోయి.. పారదర్శకమైన పద్ధతిలో పనులు చేపట్టాల్సింది పోయి ఆలస్యం చేశాయి. అనేక అక్రమాలు, అవినీతి జరిగినట్లు వార్తలు రావడం.. దురదృష్టకరం.' అని కిషన్ రెడ్డి తెలిపారు.
సింగరేణిపై కిషన్ రెడ్డి మాటల్లోనే..
- బొగ్గు వెలికి తీయడం, బొగ్గు రవాణాకు సంబంధించి టెండర్‌లో సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేర్చింది. అనేక చోట్ల సైట్ విజిట్ చేయాలనే నిబంధన ఉంది. కానీ అది సెల్ఫ్ డిక్లరేషన్. బ్లాక్‌కు సంబంధించి.. సరైన వివరాలు తెలియకుండా.. టెండర్‌కు వస్తే ఇబ్బందులుంటాయని అవగాహన కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చాం.
- సైట్ విజిట్ చేసిన తర్వాతే సదరు కాంట్రాక్టర్‌కు మినరల్ నిల్వలపై, అక్కడి భౌగోళిక స్థితిపై ఓ స్పష్టమైన అవగాహన వస్తుందనేది ఆ నిబంధనకు అర్థం. కానీ ప్రభుత్వం దీన్ని తప్పనిసరి నిబంధనగా మార్చి అవినీతికి బాటలు వేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా చోట్ల టెండర్ల ప్రక్రియలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. పారదర్శంగా పనిచేస్తున్నాం.
- కానీ సింగరేణిలో సైట్ విజిట్ నిబంధనను తప్పనిసరి చేసి బొగ్గు వెలికి తీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. కోల్ బ్లాక్‌కు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరపాలి. కేంద్రమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. కానీ కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది. నాడు కేంద్రానికి 49 శాతం భాగస్వామ్యం ఉన్న విషయాలు మరిచిపోయారా?
- కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకు లాభం చేసేలా వ్యవహరించిన మాట వాస్తవం కాదా? తాడిచర్ల కోల్ బ్లాక్‌ను జెన్కోకు కేటాయించాం. దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకొస్తే.. వారితో మేం పనిచేయలేమని లేఖ రాయించుకుని ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా?
- ఇవాళ సుమారు రూ.47వేల కోట్ల రూపాయలను సింగరేణికి బకాయి పడింది. దేశంలో ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా.. ఈ స్థాయిలో ఇబ్బందుల్లేవు. సింగరేణి పట్ల, కార్మికుల సంక్షేమం పట్ల.. నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ పార్టీల చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలి. బ్యాంకులనుంచి డబ్బులు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. సింగరేణిలో G11 grade coal అమ్మకం ధర.. టన్నుకు రూ. 4,088. ఇదే కోలిండియాలో.. G11 grade coal ఈ ధర రూ. 1,605. దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ.
- రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకుంటున్నాయి కాబట్టే సంస్థను నడిపేందుకు వారి వద్ద ధరలను పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. సింగరేణి కోల్ కొంటున్న జెన్కో కూడా ప్రభుత్వ సంస్థనే కాబట్టి.. సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతోంది. సింగరేణి బొగ్గు క్వాలిటీ 58 శాతం ఉండగా.. కోలిండియాలో బొగ్గు క్వాలిటీ 86 శాతం. సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి.. క్వాలిటీ విషయంలో, రేట్ విషయంలో తప్పటడుగులు వేస్తోంది.
- ఎన్టీపీసీ, ఏపీ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడా సింగరేణి బొగ్గు మాకు వద్దని అంటున్నాయి. అవినీతి, అక్రమాల కారణంగా సింగరేణి భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితి నెలకొంది. సింగరేణి భూములు.. గతంలో బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాలు, మండల కేంద్రాల్లో ఆక్రమణలకు గురవుతున్నాయి. అనేక పత్రికలు, చానళ్లలో.. సింగరేణి అక్రమాలపై చాలా కథనాలు వచ్చాయి. దీనిపై బోర్డు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు లేవనెత్తిన అంశాలపైనా చర్చించడం లేదు.
- సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కేంద్రం దీన్ని పరిశీలిస్తుంది. సింగరేణి కార్మికుల భవిష్యత్తును రక్షించుకునేందుకు.. వ్యవస్థను పక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే ఈ వివాదాలు బయటకొచ్చాయి. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఎలా చెల్లిస్తారు? వివిధ దశల్లో చెల్లిస్తారా? ఒకేసారి ఇస్తారా అని ప్రశ్నిస్తున్నాను.
- ఇవాళ సింగరేణి ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టి ఈ అంశాలన్నీ చర్చించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించారు. ఇది రాజకీయ పార్టీలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మాత్రమేకాదు.. ఇది సింగరేణి భవిష్యత్తుకు, దీనిపై ఆధారపడిన కుటుంబాలకు సంబంధించిన విషయం. సంస్థకు సంబంధించిన అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉంది.
- దీనిపై కోల్ సెక్రటరీ.. విదేశీ పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాస్తారు. కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారానికి సిద్ధంగా ఉన్నాను. టెండర్ల ప్రక్రియ విషయంలో.. ప్రత్యేక కమిటీ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం. బోర్డులో మేం లెవనెత్తిన చాలా విషయాలను.. వారు విస్మరించారు.
- త్రైపాక్షిక ఒప్పందం జరగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో జరిగే టెండర్లు, ఇతర ప్రక్రియపై విస్తృతంగా చర్చిస్తాం. నేను కేంద్రమంత్రి అయిన తర్వాత వ్యవస్థలో మార్పులను తీసుకొస్తున్నాను. ఎప్పటికప్పుడు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి.. సింగరేణిని లాభాల బాటలో నడిపేందుకు మాకు అప్పగిస్తే.. ఆ బాధ్యతను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


