శ్రీహరికోటకు స్కైరూట్ ‘విక్రం-1’ - జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

Skyroot Aerospace's Vikram-1 : హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన దేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రం-1’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా తెలంగాణను నిలపడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

Published on: Apr 25, 2026, 16:33:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Skyroot Aerospace's Vikram-1 : ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రం-1 ఆర్బిటల్ రాకెట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అంతరిక్షం పేరుతో స్కైరూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

స్కైరూట్ ‘విక్రం-1’ రాకెట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
స్కైరూట్ ‘విక్రం-1’ రాకెట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించడంతో ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగశాలకు తరలిస్తారు.

హైదరాబాద్ మామిడిపల్లిలోని జీఎంఆర్ ఏరోస్పేస్ – ఇండస్ట్రియల్ పార్క్‌లో నెలకొల్పిన స్కైరూట్ కు చెందిన మాక్స్-క్యూ డిజైన్ ఫెసిలిటీలో విక్రం-1 రాకెట్‌ను రూపొందించారు. దేశ అంతరిక్ష పరిశోధనలో ప్రైవేటు రంగంలో రూపొందించి అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ కావడం గమనార్హం.

ముఖ్యమంత్రి అభినందనలు…

ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ రాకెట్‌ను పూర్తిగా హైదరాబాద్‌లోనే రూపొందించి, అభివృద్ధి చేయడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా స్కైరూట్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై విక్రం-1 ఆర్బిటల్ రాకెట్ వివరాలను తెలుసుకుని వారితో మాట్లాడారు. అనంతరం స్కైరూట్ ఫెసిలిటీ సెంటర్ పరిశీలించారు.

"ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్‌ను స్కైరూట్ అభివృద్ధి చేసింది. సంస్థ 2022లో తన తొలి రాకెట్‌ను ప్రయోగించగా, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవడం ఒక అద్భుతమైన విజయం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఏరోస్పేస్ రంగంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నాయని గుర్తుచేశారు. ఏరోస్పేస్‌ను కీలక వృద్ధి రంగంగా పరిగణిస్తూ… 2047 నాటికి ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవడమే తెలంగాణ లక్ష్యమని చెప్పారు.

డిసెంబర్ 2023 నుంచి ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ అసాధారణ ప్రతిభ కనబరిచిందని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. "కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023-24, 2024-25 మధ్య ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9% అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వృద్ధికి విమాన విడిభాగాలు, రక్షణ పరికరాలు ప్రధానంగా దోహదపడ్డాయి" అని చెప్పారు.

ప్రపంచ విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక దిగ్గజాలతో భాగస్వామ్యాల ద్వారా ఏరోస్పేస్ రంగం కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పటిష్టమైన విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రతిభ, చైతన్యవంతమైన పర్యావరణ వ్యవస్థతో స్కైరూట్ వంటి కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU), అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) మరియు త్వరలో ఆధునీకరించనున్న పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను వివరించారు. పాఠ్యప్రణాళిక పరిశ్రమల ఆధారితంగా, అన్ని కోర్సులలో ఏకరూపంగా ఉండేలా చూసేందుకు, ATC లు, పాలిటెక్నిక్ కళాశాలలు రెండింటినీ YISU పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రణాళికలను వెల్లడించారు.

"ఈ సంస్థలలోని శిక్షకులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ATC ల్లోని యువతకు టాటా టెక్నాలజీస్ శిక్షణ అందిస్తోంది" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తూ హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో ఉన్న ఏటీసీని సందర్శించాల్సిందిగా స్కైరూట్ నాయకత్వాన్ని ఆహ్వానించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన స్పందిస్తూ….. YISUతో కలిసి పనిచేయడానికి ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు. "స్కిల్స్ యూనివర్సిటీ ఆలోచన ప్రత్యేకమైంది. ప్రతిభావంతుల అవసరాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. మేము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నైపుణ్య శిక్షణే. YISUతో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది" అని అన్నారు.

అంతరిక్ష సాంకేతిక రంగంలోని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ గతేడాది ముఖ్యమంత్రి దావోస్ పర్యటన సందర్భంగా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. విక్రం-1 ఆర్బిటల్ రాకెట్ తేలికైనదే కాకుండా అత్యంత దృఢమైనదిగా రూపొందించారు. బహుళ ఉపగ్రహాలను ప్రయోగించగలిగే సామర్థ్యం ఈ రాకెట్‌ కలిగిఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More