హైదరాబాద్ నగరంలో రోడ్లను విస్తరించుకోవటంతో పాటు చెరువులను పునరుద్ధరించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నాలాల ఆక్రమణలను తొలగించుకుందామని సూచించారు. పిల్లలకు క్రీడా మైదానాలు కట్టుకోవాలని… అభివృద్ధి చెందుతున్న ఒక మంచి నగరంగా అభివృద్ధి చేసుకుందామన్నారు.

కూకట్‌పల్లిలో హైడ్రా పునరుద్ధరించిన నల్లచెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. చెరువులో గంగమ్మతల్లికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
కొందరికి కష్టమొచ్చినా… బాధపడినా చెరువుల పునరుద్ధరణ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్నవారు సహకరిస్తే.. వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. చెరువులు, కాల్వలు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. చెరువుల పునరుద్ధరణలో నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీనిచ్చారు.
సీఎం రేవంత్ ప్రసంగం - ముఖ్యమైన అంశాలు:
- "దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం. అయితే, ఆక్రమణలు తొలగించి, కాలుష్యం నివారించి మూసీ నదిని పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు.
- హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, హైడ్రా పనులు ప్రారంభించినప్పుడు చాలా మంది నాపై విమర్శలు చేశారు. ఇందులో నాకెలాంటి దురుద్దేశం లేదు. నల్లచెరువును పునరుద్ధరించిన తర్వాత వేలాది మంది మొహాల్లో ఆనందం చూసినప్పుడు సంతోషం కలిగింది.
- పునరుద్ధరించిన చెరువు పార్కుల చుట్టూ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేద్దాం. స్టాల్స్ పెట్టాలి. పిల్లలు ఆడుకోవడానికి స్థలాల్లేవు. చెరువుల ఒడ్డున ఆటస్థలాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరించుకుందాం.
- ఇలాంటి పనులు చేసుకునప్పుడు నిజంగానే కొందరికి నష్టం కలిగి ఉండొచ్చు. పేదవాళ్లకు ఎవరికీ అన్యాయం చేయను. అలాంటి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను సిద్ధం చేశాం. నిజంగా నష్టం జరిగిన వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుందాం.
- రాజకీయలతో సంబంధం లేకుండా నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేద్దాం.
- అహ్మదాబాద్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగానది రివర్ ఫ్రంట్ నిర్మించుకుని ఆ నగరాలను అభివృద్ధి చేసుకున్నప్పుడు మనమెందుకు మూసీని ప్రక్షాళన చేయకూడదు" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.