SIR in Telangana : 'సర్' అభ్యంతరాల గడువు పొడిగించండి - సీఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
CM Revanth Reddy Letter to CEC : : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు తొలగించకూడదని.. అభ్యంతరాల గడువు పొడిగించాలని కోరారు.
CM Revanth Reddy Letter To CEC : తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ఎన్నికల సంఘం (ECI) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కి లేఖ రాశారు.

గడువు పొడిగించండి - సీఎం రేవంత్ రెడ్డి
అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడిగించడంతో పాటు ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. 2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 73.39 లక్షల మందిని (21.7 శాతం) గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా (ASDD) గుర్తించినట్లు ఈసీ గణాంకాలను ఉటంకించారు. ఈ వర్గంలో దాదాపు 62 శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
మరోవైపు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉండగా, 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయబడలేదని తెలిపారు. దీంతో సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని…. ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని ఎన్నికల సంఘానికి వివరించారు.
ప్రస్తుత సవరణ విధానంలో కొన్ని కీలకమైన లోపాలు ఉన్నాయని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణిస్తున్నారని తెలిపారు. నిజంగా నివాసం మారిన వారికి కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా ఎలాంటి సహాయం అందించకుండానే పాత నివాసంలోని ఓటు తొలగిస్తున్నారని పేర్కొన్నారు.
నివాసం మారిన వారి పేర్లను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను పాటించడం లేదని తెలిపారు. దీనివల్ల ఓటర్లు పోలింగ్ రోజున కేంద్రానికి వెళ్లే వరకు తమ ఓటు హక్కు తొలగిపోయిన విషయం తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
సవరణ ప్రక్రియను సులభతరం చేయాలి….
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లలో 58.6 శాతం, పరిశీలన నోటీసుల్లో 41.9 శాతం కేంద్రీకృతమై ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. ఉద్యోగాలు, వివాహాలు, తాత్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సవరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవని, అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించి…. నిర్ణయించిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ అక్టోబర్ 19 నుంచి సవరించాలని కోరారు.
గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించి, కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించాలని విజ్ఞప్తి చేశారు. నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు తమ పత్రాలను సమర్పించేందుకు వారం రోజుల సమయం సరిపోదని, కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలన్నారు.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్ కేంద్ర స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఓటర్లకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని పొందేందుకు సహకరించాలని సూచించారు.
ప్రభుత్వ ఉత్తర్వు (జీవో నంబర్ 172) ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబితాను సవరించి విస్తరించాలని సూచించారు.
హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్నందున కేవలం కొంతమంది అధికారుల నియామకం సరిపోదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓటర్ల నమోదు అధికారి స్థాయికి దిగువన అదనపు అధికారులను నియమించి, ముద్రిత నోటీసుల్లోనే నిర్దిష్ట తేదీలు, సమయాలను పేర్కొంటూ వికేంద్రీకృత విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభల నిర్వహణతో పాటు పరిపాలనా, ఇతర అవసరమైన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

