CM Revanth Reddy Review On SIR : తెలంగాణలో సాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఆదివారం జరిగిన వర్చువల్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో జిల్లాల నేతలు చురుగ్గా పాల్గొనకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంగ్రెస్ నాయకులకు భవిష్యత్తులో కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేదా ఇతర నామినేటెడ్ పోస్టులు దక్కవని తేల్చి చెప్పారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.
గాంధీ భవన్‌కు రావొద్దు.. క్షేత్రస్థాయికి వెళ్లండి - సీఎం
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అయిన ఆగస్టు 3వ తేదీ వరకు పార్టీ నాయకులు ఎవరూ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు రావద్దని, అంతా క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ఇన్‌చార్జులుగా నియమితులైన నియోజకవర్గాల్లో సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించని ఎంపీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతూనే…. తమ నియోజకవర్గాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. జూలై 20న 10 మంది ఇన్‌చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో దీనిపై సమీక్షలు నిర్వహిస్తారని, ఈ సమావేశాలకు ప్రజాప్రతినిధులు ఎవరూ గైర్హాజరు కావద్దని ఆదేశించారు.
బీఎల్ఏల నివేదికలపై నిఘా…
బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) నివేదికలపైనే కాకుండా… కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) నివేదికలను ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. వెనుకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అద్భుతంగా పనిచేసి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 100 మంది బీఎల్ఏలకు (BLAs) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి… ఆయనతో ఫొటో దిగే సువర్ణావకాశాన్ని కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మొత్తం ప్రక్రియ పురోగతిపై జూలై 30న మరోసారి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.