రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది. వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేశారు.

Published on: Mar 05, 2026 5:36 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల విషయంపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. ఈ విషయంపై ఉత్కంఠ వీడింది. అభిషేష్ సింఘ్వితోపాటుగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అయిన వేం నరేందర్ రెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. తాజాగా వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో నామినేషన్లు వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు.

వేం నరేందర్ రెడ్డి
వేం నరేందర్ రెడ్డి

సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ సింఘ్వీ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని రెండో సీటుకు ఖరాచు చేశారు. ఇందుకు రేవంత రెడ్డి ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పారు. మొత్తం 16 పేర్లను పరిశీలించి పార్టీ హైకమాండ్ పరిశీలనకు పంపారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి న్యూఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పోటీదారులను ఖరారు చేయడానికి చర్చలు జరిపారు.

కాంగ్రెస్ అధిష్టానం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొమ్మటి సాంబయ్యపై దృష్టి పెట్టింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా కోరింది. పార్టీ చివరికి నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కూడా సంప్రదించారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి సలహాదారు(ప్రజా వ్యవహారాలు) అయిన నరేందర్ రెడ్డి ఎంపికతో రేవంత్ రెడ్డికి హైకమాండ్‌తో ఉన్న అనుబంధం ఏంటో మరోసారి అందరికీ అర్థమైందని పలువురు అంటున్నారు. పార్టీ అంతర్గత వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యూహాత్మక అడుగుగా చూస్తున్నాయి. గత రాజ్యసభ ఎన్నికలలో పార్టీ రెడ్డి నాయకులను విస్మరించి, బీసీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని ఎంచుకుంది.

అదేవిధంగా గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో రెడ్డి సామాజిక వర్గం నుండి బలమైన ఒత్తిడి ఉన్నప్పటికీ వారికి చోటు కల్పించలేదు. వివేక్, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎండి. అజారుద్దీన్‌లను మంత్రివర్గంలోకి చేర్చుకుంది. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డి నామినేషన్‌ను ఆ వర్గానికి ఆలస్యంగా లభించిన గుర్తింపుగా, ముఖ్యమంత్రికి నమ్మకమైన వ్యక్తిని ఎగువసభలో ఉంచడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు.

2017లో రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు వేం నరేందర్ రెడ్డి. టీడీపీతో తనకున్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి కోసం తెంచుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఆయన విధేయతకు గుర్తింపుగా ఈ అవకాశం వచ్చిందని చర్చ జరుగుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More