Pay Scale Revision : సింగరేణి అధికారులకు దసరా కానుక - పే స్కేల్ సవరణ...! భారీగా పెరగనున్న జీతాలు
Singareni Officers Pay Scale Revision : సింగరేణి సంస్థలోని ఈ1 నుంచి ఈ7 గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ అధికారులకు దసరా కానుకగా తెలంగాణ ప్రభుత్వం వేతన స్కేళ్లను సవరించింది. అక్టోబర్ జీతం నుంచే పెరిగిన జీతాలు అందనున్నాయి.
Singareni Officers Pay Scale Revision : సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ వేళ శుభవార్తను అందించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 1,800 మంది ఈ-1 నుంచి ఈ-7 గ్రేడ్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ అధికారుల వేతన స్కేళ్లను సవరిస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ప్రకటన చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సవరణతో సింగరేణి అధికారుల జీతభత్యాలు కోల్ ఇండియా అధికారులతో సమానంగా మారనున్నాయి.

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే…?
కొత్త వేతన సవరణ వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు 2026 సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అధికారులకు లభించే ఈ పెరిగిన వేతనాలు అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు. దీంతో ఈ దసరా పండుగ వేళ సింగరేణి ఆఫీసర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
- ఈ-7 గ్రేడ్ (E7) : పాత పే స్కేల్ రూ. 1,00,000 - రూ2,60,000 కాగా…. నూతన సవరించిన స్కేల్ రూ.1,20,000 - రూ.2,80,000 కి పెరిగింది.
- ఈ-6 గ్రేడ్ (E6): పాత పే స్కేల్ రూ.90,000 - రూ.2,40,000 కాగా… నూతన సవరించిన స్కేల్ రూ.1,20,000 - రూ.2,80,000 గా నిర్ణయించారు.
- ఈ-5 గ్రేడ్ (E5): పాత పే స్కేల్ రూ.80,000 - రూ.2,20,000 కాగా.. నూతన సవరించిన స్కేల్ రూ.1,00,000 - రూ.2,60,000 కి చేరింది.
- ఈ-4 గ్రేడ్ (E4): పాత పే స్కేల్ రూ. 70,000 - రూ.2,00,000 కాగా… నూతన సవరించిన స్కేల్ రూ.90,000 - రూ. 2,40,000 గా మారింది.
- ఈ-3 గ్రేడ్ (E3): పాత పే స్కేల్ రూ. 60,000 - రూ. 1,80,000 కాగా, నూతన సవరించిన స్కేల్ రూ.80,000 - రూ.2,20,000 కి పెరిగింది.
- ఈ-2 గ్రేడ్ (E2): పాత పే స్కేల్ రూ.50,000 - రూ.1,60,000 కాగా, నూతన సవరించిన స్కేల్ రూ.70,000 - రూ.2,00,000 గా నిర్ణయించారు.
- ఈ-1 గ్రేడ్ (E1): పాత పే స్కేల్ రూ. 40,000 - రూ.1,40,000 కాగా… నూతన సవరించిన స్కేల్ రూ. 60,000 - రూ.1,80,000 కి పెరిగింది
మా ప్రభుత్వం కట్టుబడి ఉంది - డిప్యూటీ సీఎం భట్టి
"కష్టపడి పనిచేసే మన సింగరేణి అధికారులకు ఇదొక అద్భుతమైన దసరా కానుక. మేమిచ్చిన సుదీర్ఘ హామీని నెరవేరుస్తూ, కోల్ ఇండియా అధికారులతో సమానంగా దాదాపు 1,800 మంది ఈ-1 నుంచి ఈ-7 గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల వేతన స్కేళ్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. ఈ ఆర్థిక ప్రయోజనాలు సెప్టెంబర్ 25, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఇటీవల 39,000 మంది కార్మికులకు రూ.596 కోట్ల బోనస్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 5,500 పండుగ సాయం అందించాం. ఈ తాజా నిర్ణయం సింగరేణి కుటుంబం మొత్తానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని పునరుద్ఘాటిస్తోంది. తెలంగాణ ప్రగతికి, ఇంధన అవసరాలను తీర్చడానికి రెట్టింపు ఉత్సాహంతో మనమంతా కలిసి పనిచేద్దాం" అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు.
కార్మికులకు ఇప్పటికే దసరా బోనస్…
ఇటీవల దసరా పండుగ సందర్భంగా 39,000 మంది శాశ్వత కార్మికులకు కలిపి ఏకంగా రూ. 596 కోట్ల బోనస్‌ను ప్రకటించారు. దీని ప్రకారం ప్రతి ఒక్క శాశ్వత ఉద్యోగికి సగటున రూ. 1,53,912 వరకు లాభాల్లో వాటా దక్కింది. దాదాపు 38,737 మంది శాశ్వత కార్మికులు ఈ లాభాల వాటాతో ప్రయోజనం పొందారు.
దీనికి తోడు సంస్థలో సేవలు అందిస్తున్న 29,717 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు పండుగ కానుకగా ఒక్కొక్కరికి రూ. 5,500 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. సింగరేణి సాధించిన నికర లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచే సంప్రదాయాన్ని ఈసారి కూడా ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగించింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్రభుత్వ బొగ్గు గనుల సంస్థ. ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం ఈక్విటీ వాటాలు ఉన్నాయి. దేశీయ బొగ్గు మార్కెట్లో మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు తక్కువ ధరలకే బొగ్గును సరఫరా చేసే ప్రైవేట్ సంస్థల నుంచి సింగరేణి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, సమర్థవంతమైన నిర్వహణతో 2026 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఏకంగా కూ.1,754 కోట్ల నికర లాభాన్ని గడించి రికార్డు సృష్టించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

