...
...
Next Story

Pocharam Srinivas Reddy : ఆసక్తి రేపుతున్న పోచారం వ్యాఖ్యలు - కాంగ్రెస్‌పై తిరుగుబాటా? మళ్లీ అటువైపే చూస్తున్నారా?

కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. నిధులు ఇవ్వడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ తాజాగా ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

Published on: Aug 12, 2026, 13:33:36 IST
Advertisement

రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు అడుగులు వేసిన మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గానికి కేటాయించాల్సిన అభివృద్ధి నిధుల విషయంలో ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పోచారం ఏమన్నారంటే..?

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం (ఫైల్ ఫొటో)
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం (ఫైల్ ఫొటో)

మంగళవాం రోజు కామారెడ్డి జిల్లా బీర్కూరులో కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తాను అధికార పక్షంలోకి మారడం వెనుక ఎలాంటి స్వార్థం లేదని పోచారం స్పష్టం చేశారు.

"నేను మంత్రి పదవి కోసం లేదా డబ్బుల కోసం పార్టీ మారలేదు. కేవలం నా బాన్సువాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిని మనసులో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం నాకు అస్సలు ఇష్టం లేకుండే, కానీ నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఏనాడూ కాంగ్రెస్ జెండాను కప్పుకోలేదు, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను," అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలోనే బాన్సువాడలో అసలైన అభివృద్ధి జరిగిందని…. అన్నం పెట్టిన నాయకుడిని మరవడం తనకు చాలా కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు దౌర్భాగ్యుల వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

పార్టీ మారే సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను పోచారం గుర్తుచేశారు. "బాన్సువాడ నియోజకవర్గంలో ఆరు నెలల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇస్తేనే నేను జాతీయ కండువా కప్పుకున్నాను. కానీ అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా జరిగింది. పెండింగ్ బిల్లుల్లో సగం నిధులు మాత్రమే మంజూరు చేశారు. దీనివల్ల బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుత్తేదారులు (కాంట్రాక్టర్లు) పనులను పూర్తిగా నిలిపివేశారు" అని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు.

గత నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో తాను నేరుగా రేవంత్ రెడ్డినే నిలదీసినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. "ఆ సమావేశంలో రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించాను. నేను నీకు అమ్ముడుపోయానా? నా ఎమ్మెల్యేగిరిని కొన్నావా? అని ముఖం మీదే అడిగాను," అని చెప్పటం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపినట్లు అయింది.

మళ్లీ గులాబీ గూటికి చేరే సంకేతాలా….?

రాబోయే రోజుల్లో బాన్సువాడలో మళ్లీ మనమే గెలుస్తామని పోచారం ధీమా వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ నాయకత్వాన్నే పొగుడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మళ్లీ బీఆర్ఎస్‌లోకి చేరుతారా…? అనే కోణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.

పోచారం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తెగ పోస్టులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు… ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు… ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో పార్టీ కఠినంగా వ్యవహారించాలని కూడా అధినాయకత్వానికి సూచిస్తూ పోస్టులు చేశారు.

ముందుగా పార్టీ ఫిరాయించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి గులాబీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇదే తరహాలో పోచారం కూడా యూటర్న్ అవుతారా అన్న డిస్కషన్ రాజకీయవర్గాల్లో మొదలైంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe