...
...
Next Story

పెండింగ్ చలాన్లు చెల్లించాలని వాహనదారులను బలవంతపెట్టొద్దు : హైకోర్టు

ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్లు విషయంలో వాహనదారులను బలవంతపెట్టొద్దని స్పష్టం చేసింది.

Published on: Jan 20, 2026, 17:26:10 IST
Advertisement

తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌరులను ఆపి బలవంతంగా ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని అడగొద్దని స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు బలవంతపెట్టొద్దని తెలిపింది. 'ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలనుకునే ఏ పౌరుడైనా తమకు నచ్చిన విధంగా చెల్లించవచ్చు. పోలీసులు చర్యలు తీసుకోవాలనుకుంటే వారికి నోటీసులు జారీ చేయాలి. తగిన ప్రక్రియను ఫాలో కావాలి. పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించాలని, పోలీసులు వాహన కీలను లాక్కోవడం, మరే ఇతర బలవంతపు చర్యలు చేయకూడదు.' అని హైకోర్టు పేర్కొంది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను అమలు చేయడానికి ఉపయోగించే పద్ధతులను సవాలు చేస్తూ సికింద్రాబాద్ నివాసి వి. రాఘవేంద్ర చారి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణ చేసింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్, పోలీసులు వాహనదారులను ఆపకూడదని లేదా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలను అక్కడికక్కడే చెల్లించేలా వాహనాల తాళాలను తీసుకోవడం వంటి కఠినమైన చర్యలు చేయకూడదని కోర్టు పేర్కొంది.

పౌరులు తమ ఇష్టానుసారం జరిమానాలు చెల్లించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే పోలీసులు చర్యలు తీసుకోవాలనుకుంటే.. కోర్టు నోటీసులు జారీ చేయవచ్చని తెలిపింది. చట్టపరమైన ప్రక్రియలను అనుసరించాలని పేర్కొంది.

ట్రిపుల్ రైడింగ్ కోసం తనకు విధించిన రూ.1,235 జరిమానాను సవాలు చేస్తూ పిటిషనర్ గత ఏడాది నవంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ న్యాయవాది మోటారు వాహనాల చట్టం కింద నేరాలు కాంపౌండ్ చేయదగినవని, జరిమానా మొత్తాలను పేర్కొనే అధికారం రాష్ట్రానికి ఉందని వాదించారు.

రోడ్డు భద్రత దృష్ట్యా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ కేసు ప్రమాదకరమైన డ్రైవింగ్‌లోకి వస్తుందని, సెక్షన్ 184 కింద రూ. 1,000 జరిమానా విధిస్తారని పేర్కొంది.

ప్రస్తుత విచారణలో పిటిషనర్ తన వాహనం ట్రాఫిక్ పోలీసులు తీసిన ఫోటోల ఆధారంగా మాత్రమే తనకు మూడు ట్రాఫిక్ చలాన్లు అందజేసినట్లు పేర్కొన్నారు. జరిమానాలు విధించడానికి పోలీసులు తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, హ్యాండ్ కెమెరాలు, ఇతర ధృవీకరించని పరికరాలను ఉపయోగించడం కంటే ప్రభుత్వం ఆమోదించిన, ధృవీకరించిన నిఘా కెమెరాలను మాత్రమే ఉపయోగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

పోలీసులు వాహనాలను ఆపడానికి, జరిమానాలను పరిష్కరించడానికి అనుమతించే జీవో నెం. 108 చట్టబద్ధతను కూడా పిటిషనర్ సవాలు చేశారు. ఇది పోలీసులు న్యాయవ్యవస్థకు ఉన్న అధికారాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది అని అన్నారు.

మరోవైపు ఇటీవలే ట్రాఫిక్ జరిమానాలను ఉల్లంఘించిన వారి బ్యాంకు ఖాతాల నుండి డైరెక్ట్‌గా చలాన్ల డబ్బులు కట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తర్వాత పోలీసులు పౌరులను రోడ్డుపై ఆపి ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని బలవంతం చేయలేరు అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe