నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ కార్పొరేష‌న్‌ల‌లో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్

రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

Published on: Nov 4, 2026, 17:00:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆర్థిక అవరోధాలు ఎదురైనా పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలన్న సంకల్పంతో తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు.

మా ఇందిర‌మ్మ ఇంట్లో దీపావ‌ళి వేడుక‌లు
మా ఇందిర‌మ్మ ఇంట్లో దీపావ‌ళి వేడుక‌లు

ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి సూచన మేరకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గృహప్రవేశాలు పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి రోజున ఈ వేడుకలను నిర్వహించాలన్నారు. శాసనసభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పారు.

మా ఇందిర‌మ్మ ఇంట్లో దీపావ‌ళి వేడుక‌లు అనే పోస్టర్‌ను మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో క‌లిసి మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స‌హా రాష్ట్ర మంత్రి వ‌ర్గం ఈ కార్యక్రమాన్ని దిగ్విజ‌యంగా నిర్వహించాల‌ని కోరుతోంద‌ని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

అనంత‌రం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తొలి విడ‌త‌గా 4.50 ల‌క్షల ఇళ్లు, రెండో విడ‌త 2.50 ల‌క్షల ఇళ్లతో పాటు హైద‌రాబాద్ క్యూర్ ఏరియా ప‌రిధిలో ల‌క్ష ఇళ్లను మంజూరు చేశామ‌ని చెబుతూ హైద‌రాబాద్ త‌ర‌హాలోనే రాష్ట్రంలోని నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ కార్పొరేష‌న్‌ల‌లో కూడా ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణం చేప‌డ‌తామ‌ని ప్రక‌టించారు. జి+5 ప‌ద్ధతిలో నిర్మించ‌నున్న ఈ ట‌వ‌ర్స్ నిర్మాణానికి సంబంధించి దీపావ‌ళిలోగా నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నుంచి వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామ‌ని మంత్రి పున‌రుద్ఘాటించారు.

రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో చేప‌డుతున్న ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టిప‌రిస్ధితుల్లోనూ ఆపేదిలేద‌ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల బ్యాంకు ఖాతాల‌కు ప్రతి సోమ‌వారం నేరుగా హైద‌రాబాద్ నుంచి అవినీతి ర‌హితంగా నిధుల‌ను జ‌మ‌చేస్తున్నామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలోని న‌గ‌రాలు, ప‌ట్టణాలు, గ్రామాలేగాక మారుమూల ప్రాంతాలు, తండాల‌లో కూడా ఈ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం జ‌రుగుతోంద‌న్నారు. ఫ‌లితంగా పేద‌వారి సొంతింటిక‌ల సాకార‌మ‌వుతోంద‌ని మంత్రి పొంగులేటి అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More