...
...
Next Story

దేశంలో ఫస్ట్ టైమ్.. ఉస్మానియాలో ఒకేసారి రోగికి 5 అవయవాల మార్పిడి.. 36 గంటలు సర్జరీ

భారతదేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఒకే రోగికి ఒకేసారి 5 అవయవాల మార్పిడి విజయవంతం చేశారు. 36 గంటల పాటు ఈ సర్జరీ జరిగింది.

Published on: Jul 1, 2026, 17:46:16 IST
Advertisement

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు సరికొత్త రికార్డు సృష్టించారు. భారతదేశ వైద్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకే రోగికి ఒకే సమయంలో ఐదు అవయవాలను అమర్చారు. అత్యంత సంక్లిష్టమైన మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఉస్మానియాలో అరుదైన చికిత్స
ఉస్మానియాలో అరుదైన చికిత్స

ఒకే వ్యక్తికి జీర్ణాశయం, మ్యూకస్ పొర కలిగిన చిన్నపేగు ప్రారంభ భాగం, క్లోమగ్రంథి, చిన్నపేగు, కుడి వైపు పెద్దపేగులను ఒకే విడతలో మార్పిడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాంతకమైన, అత్యంత అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉస్మానియాలో చేరారు. ఈ రోగి ప్రాణాలను కాపాడేందుకు జూన్ 29న ప్రారంభమైన ఈ శస్త్రచికిత్స సుమారు 36 గంటల పాటు నిరంతరాయంగా సాగి జూన్ 30 సాయంత్రానికి ముగిసింది. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ అద్భుత విజయంపై జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ స్పందించారు. 'మన ప్రభుత్వ వైద్యుల అసాధారణ ప్రతిభకు, నిబద్ధతకు ఈ విజయం ఒక నిదర్శనం. భారత వైద్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఉస్మానియా వైద్య బృందానికి నా అభినందనలు.' అని కొనియాడారు.

ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ మాట్లాడుతూ.. నెఫ్రాలజీ, యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, అనస్థీషియా వంటి పలు విభాగాలకు చెందిన నిపుణులు ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలోనే బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించిన ఒక మహిళ ఈ ఐదు అవయవాలను దానం చేయడం విశేషం. వీటితో పాటు ఆమె కళ్ళు, చర్మం, కాలేయం, మూత్రపిండాలను కూడా ఇతర రోగుల కోసం దానం చేశారని ఆయన పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks