తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొద్దిరోజుల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం….. బంగాళాఖాతంలో అల్పపీడనం రూపుదిద్దుకుంటోంది.

ప్రస్తుతం వాయవ్య ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో పాటు నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా పయనించి, తదుపరి 24 గంటల్లో మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశముంది.
ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్…
కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగల మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుంది. రాయలసీమలో కూడా రాబోయే కొన్ని రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నప్పటికీ….. నవంబర్ 14వ తేదీన రాయలసీమ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 11 నుంచి 16 వరకు రాబోయే ఆరు రోజుల పాటు ప్రధానంగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి తీవ్ర హెచ్చరికలు లేవు.
ఇక హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు ఆవరించే అవకాశముంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 32°C, కనిష్ట ఉష్ణోగ్రత 16°C గా నమోదయ్యే సూచనలున్నాయి. ఈశాన్య దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయి.
తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచే చలి పంజా విసురుతోంది. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 14.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, రాజన్నసిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో 14.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రమంతటా చలిగాలులు వీచే సూచనలున్నాయి.