జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : ప్రచార పర్వానికి దగ్గరపడిన సమయం - ఇక పోల్‌ మేనేజ్‌మెంటే కీలకం..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోరు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. అయితే ఈ గడువు ఆదివారం(నవంబర్ 9)తో ముగియనుంది. మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమించే పనిలో పడ్డాయి.

Published on: Nov 8, 2025, 12:00:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం… రేపు (నవంబర్ 9) సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. దీంతో మైకులు బంద్ కావటమే కాదు… ఇతర ప్రాంతాల నేతలు కూడా నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి ఉంటుంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : జోరుగా ఉపఎన్నికల ప్రచారం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : జోరుగా ఉపఎన్నికల ప్రచారం

ఇవాళ, రేపు మాత్రమే ప్రచారానికి సమయం ఉండటంతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రతి ఇంటికి వెళ్తూ… ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా…. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

నవంబర్ 11న పోలింగ్

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కోసం నవంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇక నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి… ఫలితాలను ప్రకటిస్తారు.

నవంబర్ 9 నుంచి 11 వరకు నియోజకవర్గ పరిధిలోని వైన్స్ షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 9వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వరకు అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయి. వైన్స్, బార్లు, రెస్టారెంట్లు అన్ని మూసివేసి ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ నవంబర్ 14వ తేదీన నిర్వహిస్తారు. ఆ రోజు కూడా నియోజకవర్గపరిధిలోని అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరిగేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి (BRS) సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు.

ఉప ఎన్నికకు గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది . కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు మరికొంత మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది.

మొత్తంగా చూస్తే…. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు ఆసక్తికరంగా సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా ప్రధాన పార్టీలు పక్కాగా అడుగులేసే పనిలో ఉన్నాయి. ఓవైపు క్షేత్రస్థాయిలో ముఖ్య నేతలను మోహరించగా… మరోవైపు పార్టీలోని కీలక నేతలు ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో ప్రచార వేడిని పెంచుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగులు పేలుతుండగా… మరోవైపు బీజేపీ నేతలు ఆ రెండు పార్టీలను కార్నర్ చేస్తూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు.

రేపటితో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో పోల్ మేనేజ్మేంట్ పై కూడా ఆయా పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. చివరి నిమిషం వరకు పట్టు విడవకుండా పని చేయాలని పార్టీ అధినాయకత్వాలు దిశానిర్దేశం చేస్తున్నాయి. డివిజన్ల వారీగా పక్కాగా లెక్కలు వేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఫైనల్ గా జూబ్లీహిల్స్ అడ్డాలో ఈసారి ఎవరు గెలుస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More