...
...
Next Story

అక్టోబర్‌లో అందుబాటులోకి కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే.. గంటలోపే జర్నీ

karimnagar-warangal national highway : అక్టోబర్‌లో కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గనుంది.

Published on: Sep 10, 2026, 08:01:02 IST
Advertisement

కరీంనగర్, వరంగల్ మధ్య ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారి(NH 563) నాలుగు లేన్ల విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. NHAI అధికారులు ఈ రహదారిపై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారు. దసరా పండుగ కానుకగా ఈ రహదారిని జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

వరంగల్-కరీంనగర్ హైవే
వరంగల్-కరీంనగర్ హైవే

ప్రస్తుతం కరీంనగర్ నుంచి వరంగల్ చేరుకోవడానికి సుమారు 90 నిమిషాలు(గంటన్నర) సమయం పడుతుండగా, ఈ నూతన నాలుగు లేన్ల రహదారి ప్రారంభమైన తర్వాత ప్రయాణ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గిపోనుంది. దాదాపు గంటలోపే ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన భారత్‌మాల పథకం కింద 68 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ 4 లేన్ల ప్రాజెక్టును రూ. 1,641 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు.

ఈ రహదారిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సదుపాయాలను ఏర్పాటు చేశారు. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి, ప్రమాదాలను నివారించడానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.

రహదారి పొడవునా రాత్రివేళల్లో వెలుగులు పంచే సోలార్ దీపాలు, భద్రత కోసం హై-రిజల్యూషన్ సిసిటివి కెమెరాలను అమర్చారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సేవలు సంఘటనా స్థలానికి త్వరితగతిన చేరుకునేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

ఈ రహదారిలో 9 ప్రధాన వంతెనలు, 23 చిన్న వంతెనలతోపాటు పలు అండర్‌పాస్‌లను నిర్మించారు. పట్టణాల్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్ ప్రాంతాల మీదుగా బైపాస్ రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద అత్యాధునిక టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు.

గతంలో రోడ్డు అధ్వానంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు 4-లేన్ల రహదారి అందుబాటులోకి రావడంతో వాహనాల రాకపోకలు చాలా సునాయాసంగా సాగుతున్నాయి. గతంలో ఈ మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ కొత్త హైవే వల్ల ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని స్థానికులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks