BRS State Executive Committee Meeting : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. సోమవారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళనతో పాటు చేపట్టాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకువాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ మినహా అన్ని స్థాయిల కమిటీలను రద్దు చేశారు. పునర్నిర్మాణ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు.

పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. కేవలం బుక్ ద్వారానే కాకుండా, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల్లో సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు.అలాగే ఇటీవలే పార్టీలో చేరిన జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ కార్యవర్గానికి పరిచయం చేశారు.
ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్….
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. తమ హయాంలో తెలంగాణను వ్యవసాయంలో నెంబర్ వన్ గా నిలబెడితే…. ప్రస్తుత ప్రభుత్వం భూముల కబ్జాల్లో, కూలగొట్టడాల్లో నెంబర్ వన్ గా ఉందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, కొనుగోళ్లు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఎలాగైతే ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసిందో…. ఇప్పుడు కూడా అలాగే చేయాలన్నారు. లేదంటే ఊరూరా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ పట్ల అవమానకరంగా మాట్లాడినప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి ఎంపీలు మౌనంగా ఉండటాన్ని కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. "తెలంగాణ కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఇక్కడ పుట్టలేదా? వారికి తెలంగాణ పౌరుషం లేదా?" అని ఆయన ప్రశ్నించారు. అదే ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా…. క్షమాపణ చెప్పించే వరకు పోరాడేవాళ్లమని గుర్తు చేశారు.