వైభవంగా నాగోబా జాతర ప్రారంభం.. ఏ రోజు ఏం చేస్తారంటే?

అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో ఘనంగా ప్రారంభమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Published on: Jan 19, 2026, 11:32:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదివాసీ పండుగ క్యాలెండర్ చూసుకుంటే.. సాంప్రదాయకంగా కెరమెరి మండలంలో జంగు భాయ్ జాతరతో ప్రారంభమై ఇంద్రవెల్లిలో నాగోబా జాతరతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం పుష్య మాసం ముగింపులో అమావాస్య రాత్రి నిర్వహిస్తారు.

నాగోబా జాతర
నాగోబా జాతర

మేడారంలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత నాగోబా జాతర రెండో అతిపెద్ద ఆదివాసీ పండుగ. మేస్రం కుటుంబ సభ్యులు నాగదేవతకు అభిషేకం చేసిన తర్వాత వేడుకలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ.. ప్రత్యేక పూజలు చేశారు.

పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు ఈ నాగోబా జాతరను మెుదలుపెడతారు. ఆచారంలో భాగంగా గోదావరి నది నుండి పవిత్ర జలాన్ని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగు నుండి దాదాపు 140 కి.మీ.ల దూరం కాలినడకన కేస్లాపూర్‌కు తీసుకువస్తారు. జాతరకు రెండు రోజుల ముందు తెచ్చిన నీటిని ఆలయం సమీపంలోని మర్రి చెట్టుకు కట్టి, తరువాత అభిషేకానికి ఉపయోగిస్తారు. తర్వాత జాతర మెుదలవుతుంది.

జాతరకు ముందు ఆలయ కమిటీ అవగాహన కల్పించడానికి, ఏర్పాట్లు చేయడానికి ఎడ్ల బండ్లపై ప్రచారాన్ని చేపట్టింది. తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 2,500 నుండి 3,000 మేస్రం వంశీయుల కుటుంబాలు వచ్చాయి. నాగోబా జాతరకు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో జనం వస్తారని అధికారులు భావిస్తున్నారు.

జాతర జనవరి 18న అర్ధరాత్రి ప్రారంభమైంది, 20న పెర్సపేన్, బాన్ పేన్ పూజలు, జనవరి 22న నాగోబా దర్బార్ నిర్వహిస్తారు. 23న బేతాల్ పూజ, మండగాజాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగుస్తుంది. జనవరి 25 వరకు భక్తులు సందర్శించే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం జనవరి 27 నుంచి 31 వరకు కరీంనగర్‌ రీజియన్‌ నుంచి టీజీఎస్‌ఆర్‌టీసీ సుమారు 700 ప్రత్యేక బస్సులను నడపనుంది. కరీంనగర్‌, హుస్నాబాద్‌, హుజూరాబాద్‌, పెద్దపల్లి, గోదావరిఖని, మంథని డిపోల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More