రేడియల్ రోడ్-2 టెండర్లలో భారీ స్కామ్... సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

రేడియల్ రోడ్-2 టెండర్లలో తీవ్ర అక్రమాలు జరిగాయని కేటీఆర్ ఆరోపించారు. కాంట్రాక్టుల కేటాయింపును రద్దు చేసి సీఏజీతో సమగ్ర విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

Published on: Oct 11, 2026, 07:53:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రూ. 3,296 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రేడియల్ రోడ్-2 ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని…. కాంట్రాక్టుల కేటాయింపుపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఓ సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు.

కేటీఆర్
కేటీఆర్

తక్కువ ధరకు బిడ్లు వేసిన సంస్థలను నిబంధనలకు విరుద్ధంగా సాంకేతిక కారణాలతో పక్కన పెట్టారని… ప్రభుత్వం తనకు అనుకూలమైన కంపెనీలకు అంచనా వ్యయం కంటే ఎక్కువ ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. టెండర్లకు సంబంధించిన అన్ని పత్రాలను, నిబంధనలను, ఎంపిక చేసిన ప్రక్రియను వెంటనే బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

వివరాలు బయటపెట్టాలి - కేటీఆర్

ఔటర్ రింగ్ రోడ్ (ORR) బుద్వేల్ నుంచి ఎన్ హెచ్-167ఎన్ కొడంగల్ వరకు 81.15 కిలోమీటర్ల పొడవున గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ఈ ప్రాజెక్టును తలపెట్టారు. దీనిని మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అయితే, ఈ ప్రాజెక్ట్ కేటాయింపులో ప్రభుత్వం పారదర్శకతను పూర్తిగా పక్కనబెట్టిందని కేటీఆర్ విమర్శించారు.

టెండర్ల ప్రక్రియ వేగంగా పూర్తయిన తీరుపై కేటీఆర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బిడ్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 30 కాగా.. అక్టోబర్ 8 నాటికే టెక్నికల్ ఎవాల్యుయేషన్, అర్హతల పరిశీలన, ఫైనాన్షియల్ బిడ్ల ఓపెనింగ్, ప్రాజెక్ట్ కేటాయింపు అంతా పూర్తయిందని ఆయన గుర్తుచేశారు. దాదాపు రూ. 3,300 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి 13 బిడ్లను కేవలం ఐదు పనిదినాల్లో ఎలా పరిశీలించి, నిర్ణయం తీసుకున్నారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్యాకేజీ-1ను ఎన్సీసీ లిమిటెడ్ సంస్థకు అంచనా వ్యయం కంటే 3.95 శాతం ఎక్కువ ధరకు.. అంటే రూ. 1,286.03 కోట్లకు కట్టబెట్టారని పేర్కొన్నారు. ప్యాకేజీ-2ను బీవీఎస్ఆర్ సంస్థకు కేటాయించారని… ప్యాకేజీ-3ను జికిసి సంస్థకు ఇచ్చారన్నారు. ఈ మూడు ప్యాకేజీలకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం ఎంత..? వివిధ కంపెనీలు వేసిన బిడ్ల వివరాలు, తులనాత్మక పరిశీలన పత్రాలు, చివరిగా ఖరారు చేసిన మొత్తం వివరాలను వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సుశి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ సంస్థ న్యాయస్థానంలో వేసిన పిటిషన్ అంశాన్ని కూడా కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. ఆ కంపెనీని మూడు ప్యాకేజీల నుంచి అన్యాయంగా అనర్హత వేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 600 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని కోర్టు ముందర దాఖలైన ఆధారాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక విచారణ జరిపించి, నష్టానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

కేవలం రేడియల్ రోడ్-2 మాత్రమే కాకుండా.. రూ. 591 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రేడియల్ రోడ్-1 టెండర్లలోనూ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. అంచనా కంటే 15 శాతం ఎక్కువ మొత్తానికి దీనిని కేటాయించారని ఆయన పేర్కొన్నారు. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ రికార్డులను వెంటనే బయటపెట్టాలని ఆయన కోరారు.

కేటీఆర్ ప్రధాన డిమాండ్లు…

  • రేడియల్ రోడ్-2 రూ. 3,296 కోట్ల టెండర్లను వెంటనే రద్దు చేసి సమగ్ర విచారణ జరిపించాలి.
  • అన్ని ప్యాకేజీల ఫైనాన్షియల్ బిడ్లు, టెక్నికల్ ఎవాల్యుయేషన్ నివేదికలు, కమిటీ మినిట్స్ ను వెంటనే ప్రచురించాలి.
  • హెచ్ఎండిఏ , హెచ్ జిసిఎల్ ఆధ్వర్యంలో గడిచిన మూడేళ్లలో రూ. 100 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులపై కాగ్ (CAG) చేత ప్రత్యేక ఆడిట్ చేయించాలి.
  • కాంట్రాక్టుల కేటాయింపులు, బిడ్డర్ల అనర్హతపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి.

ప్రజాధనంతో చేపడుతున్న ఇన్ని కోట్ల ప్రాజెక్టులపై ప్రభుత్వం నోరు విప్పాల్సిందేనని, తమ వద్ద ఎలాంటి అక్రమాలు జరగలేదని భావిస్తే ఆధారాలతో సహా నిరూపించుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు.రేడియల్ రోడ్ల పేరిట తెలంగాణ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ముఖ్యమంత్రిని…. కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More