...
...
Next Story

LPG Gas eKYC : ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్ - ముగియనున్న ఈ-కేవైసీ గడువు! ఆలస్యం చేయకండి

గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయాలి. సబ్సిడీ కొనసాగాలన్నా, సాధారణ ధరకే సిలిండర్ పొందాలన్నా బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియ తప్పనిసరి. అయితే ఈ గడువు ఈనెల 16తో ముగియనుంది.

Published on: Aug 14, 2026, 17:18:13 IST
Advertisement

గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయంపై గడువును కూడా విధించాయి. ఈనెల 16వ తేదీలోపు గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని చెబుతున్నాయి. అయితే ఈ గడువు కూడా దగ్గరపడుతోంది. ఇప్పటివరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయని వినియోగదారులు… వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని ఆయా కంపెనీలు సూచిస్తున్నాయి.

గ్యాస్ కనెక్షన్ - ఈకేవైసీ ఉండాల్సిందే (image source HP )
గ్యాస్ కనెక్షన్ - ఈకేవైసీ ఉండాల్సిందే (image source HP )

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాల వద్ద, గ్యాస్ డెలివరీ బాయ్స్ వద్ద బయోమెట్రిక్ నమోదు చేయించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిజానికి ఈ-కేవైసీ పూర్తి చేయడానికి గడిచిన జూలై నెలలోనే గడువు ముగియాల్సి ఉంది. అయితే వినియోగదారుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని చమురు కంపెనీలు ఈ అవకాశాన్ని ఈ నెల 16 వరకు పొడిగించాయి.

ఎవరి పేరు మీదైతే గ్యాస్ కనెక్షన్ ఉందో, ఆ వ్యక్తి మాత్రమే నేరుగా వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవాలని స్పష్టమైన నిబంధన విధించారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోతే గ్యాస్ సిలిండర్ బుకింగ్ కావడం లేదు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ, కేవైసీ అప్‌డేట్ కాకపోవడంతో ఆ బుకింగ్స్ స్వయంచాలకంగా రిజెక్ట్ అవుతున్నాయి.

ఈ-కేవైసీ తప్పనిసరి చేయడంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. గ్యాస్ కనెక్షన్ పొందిన అసలు యజమానులు చనిపోయి, వారి కుటుంబసభ్యులు ఆ కనెక్షన్‌ను వాడుతుంటే ఇప్పుడు ఈ-కేవైసీ చేయడం తీవ్ర ఇబ్బందిగా మారింది. వయోభారంతో ఉన్న వృద్ధులకు బయోమెట్రిక్ యంత్రాలపై వేలిముద్రలు సరిగా పడకపోవడంతో కేవైసీ ప్రక్రియ ఆగిపోతుంది.

ఈ-కేవైసీ ఎలా చేసుకోవాలి?

వయోభారం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల వేలిముద్రలు పడని వృద్ధులు నేరుగా ఏదైనా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఐరిస్ స్కాన్ ఆధార్ వివరాలను సరిచూసి, ఈ-కేవైసీ ప్రక్రియను అప్‌డేట్ చేస్తారు. వినియోగదారులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమీప ఏజెన్సీని సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని చమురు సంస్థలు కోరుతున్నాయి.

మొబైల్ ఫోన్ ద్వారా ఇలా…

గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొబైల్‌ ఫోన్‌ ద్వారా LPG గ్యాస్ e-KYC పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మీ గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన అధికారిక యాప్‌తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ముందుగా గ్యాస్ కనెక్షన్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌తో సంబంధిత యాప్‌లో లాగిన్ అవ్వాలి.

మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ఖాతాను ధృువీకరించుకోవాలి. అనంతరం మెనూలో LPG e-KYC, Aadhaar Authentication వంటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, అవసరమైన పర్మిషన్స్ ఇవ్వాలి. Capture Face లేదా స్కాన్ ఫేస్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటిస్తూ కెమెరా ముందు ముఖాన్ని చూపించాలి. ఫేస్ స్కాన్ పూర్తయిన తర్వాత e-KYC విజయవంతంగా పూర్తయినట్లు కర్ఫర్మెషన్ మెసేజ్ లేదా గ్రీన్ టిక్ కనిపిస్తుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks