...
...
Next Story

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలా దినుసులు సీజ్.. మెుత్తం 25,300 కేజీలు

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలా దినుసులను పట్టుకున్నారు అధికారులు. వాటిని చూస్తే.. నిజమైన వాటిలాగానే కనిపిస్తున్నా.. అందులో కలిపిన రసాయనాలు ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి.

Published on: Aug 4, 2026, 15:37:44 IST
Advertisement

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా విభాగం సంయుక్తంగా నిర్వహించిన భారీ తనిఖీల్లో ఏకంగా 25,300 కిలోలకు పైగా కల్తీ మసాలా దినుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

కల్తీ మసాలా దినుసులు సీజ్
కల్తీ మసాలా దినుసులు సీజ్

మసాలా దినుసులు ఆకర్షణీయంగా కనిపించేందుకు, వాటి బరువును కృత్రిమంగా పెంచేందుకు వ్యాపారులు అత్యంత ప్రమాదకరమైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దుస్తులకు వేసే కలర్లు, ఇండస్ట్రియల్ రంగులు, పౌడర్, సింథటిక్ రంగులను విస్తృతంగా వాడారు. నాణ్యత లేని దినుసుల రూపురేఖలను మార్చి ప్రకాశవంతంగా చూపించడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ బరువు వచ్చేలా చేసి అధిక లాభాలు గడించడం చేస్తుంటారు కల్తీ రాయుళ్లు.

అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో లభ్యమైన కల్తీ మసాలా దినుసులు, వాటి పరిమాణం భారీ మెుత్తంలో ఉంది. వాము 7,920 కేజీలు, జీలకర్ర 6,700 కేజీలు, ఆవాలు 4,960 కేజీలు, జీలకర్ర పొడి/డస్ట్ 2,350 కేజీలు, షాజీరా 2,280 కేజీలు, లవంగాలు 550 కేజీలు, సోంప్ 540 కేజీలు.. అంతేకాకుండా ఈ కల్తీ దినుసుల తయారీకి ఉపయోగించే 89,150 కిలోల రా మెటీరియల్‌ను (రసాయనాలు, రంగులు మొదలైనవి) కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాణాంతకమైన ఫ్యాబ్రిక్ డైలు, కెమికల్స్ కలిపిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, కాలేయ సమస్యలు, జీర్ణకోశ సంబంధిత తీవ్ర రుగ్మతలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర సీపీ వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో ఆహార కల్తీని అరికట్టేందుకు H-FAST బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని, కల్తీ సమాచారం తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు లేదా జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేయాలని కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe