...
...
Next Story

బీసీ-ఏలోకి ముదిరాజ్ సామాజిక వర్గం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్

బీసీ-ఏలోకి ముదిరాజ్ సామాజిక వర్గాన్ని చేర్చే అంశంపై అధ్యయనం చేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రాతిపదికగా భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా నిర్ణయం ఉండనున్నట్టుగా చెప్పారు.

Published on: Oct 22, 2026, 16:50:45 IST
Advertisement

ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-ఏ గ్రూపులో చేర్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిరుపేదల కోసం జీవితాలను త్యాగం చేసిన పోరాటయోధులు పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలను ట్యాంక్ బండ్ పరిసరాల్లో ప్రతిష్టించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పండుగ సాయన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సాయన్నపై రూపొందించిన పాటలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముదిరాజ్ కమ్యూనిటీని బీసీ-డీ నుంచి మరో గ్రూపులోకి మార్చే అంశంపై గతంలో సరైన లెక్కలు లేవన్న కారణంగా న్యాయస్థానాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రాతిపదికగా భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ముదిరాజ్‌లను గ్రూపు-ఏ లోకి మార్చడంపై మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా అధ్యయనం చేస్తుందని తెలిపారు. ఈ ఉపసంఘం న్యాయనిపుణులు, అధికారులతో సంప్రదింపులు జరిపిన మీదట, మంత్రివర్గంలో చర్చించి ముదిరాజ్‌లకు న్యాయం జరిగేలా సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ప్రభుత్వం నిర్వహించిన కులగణనతో ఇప్పుడు బీసీల లెక్కలు పక్కాగా ఉన్నాయని, పక్కా ప్రణాళికతో సముచిత నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. ముదిరాజ్‌లను బీసీ-ఏ గ్రూపులో చేర్చడం ద్వారా గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందన్న అనుమానాలు, అపోహలు ఉన్నాయని, అన్ని వివరాలపై ఆ వర్గాలతో చర్చించి వారిలోని అపోహలను దూరం చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు.

ఒకటి అరా ఎక్కడైనా తప్పిపోతే లెక్కలను సవరించుకోవడం మన బాధ్యత అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో ఉందన్నారు. పక్కాగా లెక్కగట్టి సామాజిక న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పక్కా న్యాయం జరగాలన్నదే లక్ష్యమన్నారు.

ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం చాలామంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని, 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించిందని గుర్తుచేశారు. దేశంలోనే ఎస్సీ కులాల వర్గీకరణ చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని చెప్పారు. ఇలా జటిలమైన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు. ఆలస్యమైనా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది. ఈ జాతి సమస్యలపై సంపూర్ణ అవగాహన నాకుందన్నారు.

నిరుపేదలు, బహుజనులకు అండగా వారి భూములను రక్షించాలని, జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా పౌరుషంతో నేలకొరిగినా ఫరవాలేదని సర్వం ఒడ్డి పండుగ సాయన్న పోరాటం చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. నిరుపేదలు పండుగ సాయ్న పేరు జానపదాల రూపంలో పల్లెల్లో ఇప్పటికీ స్మరిస్తారని చెప్పారు. ఆ గొప్ప పోరాటయోధుడు పాలమూరు బిడ్డ అయినందుకు తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. జాతి మొత్తం తలెత్తుకునే విధంగా చరిత్ర పుటల్లో పండుగ సాయన్నకు ఒక పేజీ ఉండాలన్నారు. సమాజానికి ఉపయోగపడేది ఏదైనా తక్షణ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

'గతంలో 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత కరెంటిస్తే, ఇప్పుడు 200 యూనిట్ల లోపు వినియోగదారులు 55 లక్షల కుటుంబాలకు ఉచితంగా గృహవిద్యుత్ ఇస్తున్నాం. రూ. 2 లక్షలున్న రాజీవ్ ఆరోగ్యశ్రీని పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాం. రైతు భరోసా రూ. 10 వేలు ఉంటే రూ. 12 వేలకు పెంచి ఇస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 14 వేల కోట్లకు పైగా వెచ్చించింది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

25 లక్షలకు పైగా రైతులకు రూ. 2 లక్షల మేరకు రుణమాఫీ చేశామని, నిరుపేదలకు 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు రేవంత్ రెడ్డి. షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి ఏ పథకం ఆపలేదన్నారు. మంచి పని ఎవరు చేసినా వాటిని మరింత మెరుగ్గా చేసి అమలు చేశామే తప్ప ఏ ఒక్కటీ ఆపలేదు అని స్పష్టం చేశారు.

సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, జ్యోతీరావు పూలే, చాకలి ఐలమ్మ ఎంతో మంది బహుజనుల కోసం పోరాడిన యోధులని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కొందరు పోరాటయోధుల చరిత్రను కనుమరుగు చేశారన్నారు. జాతి కోసం జీవితాంతం తపించి, సర్వం త్యాగం చేసిన వారికి చరిత్రలో స్థానం లేకపోతే, ఈ నేల ఉన్నా లేకపోయినా ఒకటే అని వ్యాఖ్యానించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks