...
...
Next Story

హైదరాబ్ వేదికగా భారత్‌ సమ్మిట్‌ - రాహుల్ గాంధీ రాక..! గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం

నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా జరగనున్న భారత్ సమిట్‌కు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో గిగ్ వర్కర్లతో ఆయన ప్రత్యేక్షంగా భేటీ అయ్యే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

Published on: Nov 11, 2026, 07:48:46 IST
Advertisement

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 13 లేదా 14వ తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'భారత్ సమిట్' అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో అత్యంత కీలకమైన గిగ్ వర్కర్లతో (స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, డెలివరీ అగ్రిగేటర్ కార్మికులు) ప్రత్యేకంగా సమావేశమై వారితో నేరుగా మాట్లాడాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు.

రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ

ఢిల్లీలో రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిసిన అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత కోసం చట్టం రూపొందించిన విషయాన్ని రాహుల్ గాంధీకి వివరించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే గిగ్ వర్కర్ల సమస్యలు, వారి హక్కులు, చట్టం అమలుపై వారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని రాహుల్ స్వయంగా సూచించారని చెప్పారు. భారత్ సమిట్ కార్యక్రమంతో పాటే ఈ సభ కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.

బీసీ ర్యాలీకి ఆహ్వానం….

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న వివిధ సంస్థాగత, అభివృద్ధి కార్యక్రమాలను రాహుల్ గాంధీకి పీసీసీ చీఫ్ నివేదించారు. తెలంగాణలో త్వరలోనే నిర్వహించతలపెట్టిన భారీ 'మెగా బీసీ ర్యాలీ'కి హాజరుకావాల్సిందిగా ఆయనను అధికారికంగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ప్రపంచ రాజకీయాలు, భౌగోళిక పరిస్థితుల్లో వస్తున్న వేగవంతమైన మార్పులు, నూతన ప్రపంచ వ్యవస్థ రూపకల్పన, భారతదేశ వ్యూహాత్మక అడుగులు వంటి అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ 'భారత్ సమిట్' సదస్సును నిర్వహిస్తోంది. దీనితో పాటు సహకార సమాఖ్య విధానం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలపైనా ఇందులో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నాయకులు, అంతర్జాతీయ ప్రగతిశీల ఉద్యమాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాలుపంచుకోనున్నారు. కాగా…. మార్చి నెలలో తెలంగాణ శాసనసభ గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks