Secunderabad Railway Station : సరికొత్త హంగులతో సిద్ధమవుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ - శరవేగంగా అభివృద్ధి పనులు
Secunderabad Railway Station redevelopment : రూ.714.73 కోట్లతో రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు 71 శాతానికి చేరాయి. మల్టీ లెవల్ పార్కింగ్, స్కైవాక్, అధునాతన ఎయిర్ కాన్కోర్స్తో సరికొత్త హంగులతో సిద్ధమవుతోంది.
Secunderabad Railway Station redevelopment :తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన, దేశంలోనే ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒక్కటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందించేందుకు చేపట్టిన పునర్నిర్మాణ (రీడెవలప్మెంట్) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.714.73 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 71 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రతిరోజూ సుమారు 180 రైళ్ల రాకపోకలతో, దాదాపు 1.5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలతో కిటకిటలాడే సికింద్రాబాద్ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రవాణా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన ఈ ఆధునీకీకరణ పనుల ద్వారా భవిష్యత్తులో ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన, అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కలగనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేయటంతో పాటు పనుల వివరాలను వెల్లడించారు.
ప్రధాన పనులు :
- ఐకానిక్ లుక్‌తో ఉభయ దిశలా ఉండేలా ఉత్తర, దక్షిణ స్టేషన్ భవనాల నిర్మాణం.
- ప్రయాణికుల రద్దీని సులభంగా నియంత్రించేందుకు రెండు అంతస్తుల ఎయిర్ కాన్కోర్స్.
- అన్ని ప్లాట్‌ఫారమ్‌లను కవర్ చేస్తూ అధునాతన కవర్-ఓవర్-ప్లాట్‌ఫారమ్ షెడ్లు.
- వాహనాల నిలిపివేత కోసం స్టేషన్ ఉత్తర భాగంలో భారీ మల్టీ-లెవల్ పార్కింగ్ భవనం.
- నడక శ్రమను తగ్గించేలా 'ట్రావలేటర్లు' (Travelators) అమర్చిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు (FOBs).
- నేరుగా మెట్రో స్టేషన్‌కు అనుసంధానించేలా సరికొత్త స్కైవాక్ సదుపాయం.
- ఆధునీకరించిన ప్లాట్‌ఫారమ్ ఫ్లోరింగ్, అధునాతన ప్రయాణికుల నిరీక్షణ హాళ్లు.
పూర్తయిన పనుల వివరాలు....
ఈ ప్రాజెక్టులో భాగంగా అత్యంత కీలకమైన కొన్ని నిర్మాణాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ప్రత్యేక భవనం, కాజీపేట వైపు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యాయి. అలాగే దక్షిణ వైపున ఉన్న స్టేషన్ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ప్రయాణికుల రాకపోకల విభాగాలు, సౌత్ బేస్మెంట్, సౌత్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.
ప్రస్తుతం కొనసాగుతున్న పనులు…
ప్రస్తుతం స్టేషన్ ప్రాంగణంలో మిగిలిన నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. దక్షిణ, ఉత్తర స్టేషన్ భవనాల నిర్మాణాలు, ఉత్తర భాగంలోని బేస్మెంట్ మరియు మల్టీ-లెవల్ కార్ పార్కింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
వీటితో పాటు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉండే ఎయిర్ కాన్కోర్స్ నిర్మాణం, హైదరాబాద్ వైపు ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫారమ్ 1, 10లను అనుసంధానిస్తూ ట్రావలేటర్లతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. మెట్రో స్టేషన్‌తో కనెక్టివిటీ ఇచ్చే స్కైవాక్ పనులు, ప్లాట్‌ఫారమ్ ఫ్లోరింగ్ ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, తెలంగాణ రవాణా రంగానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

