దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ (NEET) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల సమయంలో ప్రయాణికుల నుంచి వచ్చే విపరీతమైన రద్దీని తట్టుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం…… చర్లపల్లి - తిరుపతి(రైలు నంబర్ 07052) ప్రత్యేక రైలు ఆదివారం(ఇవాళ) రాత్రి 8:25 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 1:15 గంటలకు తిరుపతి స్టేషన్‌కు చేరుకుంటుంది. సుదూర ప్రాంతాల నుంచి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు వీలుగా ఈ రైలులో కేవలం జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను మాత్రమే అందుబాటులో ఉంచారు.
స్టాపింగ్స్ వివరాలు …
ఈ స్పెషల్ ట్రైన్…. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు కీలక జంక్షన్లు, స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
- కాచిగూడ
- షాద్‌నగర్
- జడ్చర్ల
- మహబూబ్‌నగర్
- గద్వాల్
- కర్నూల్ సిటీ
- డోన్
- గుంతకల్
- గుత్తి
- తాడిపత్రి
- ఎర్రగుంట్ల
- కడప
- రాజంపేట
- కోడూరు
- రేణిగుంట
ఈ రూట్లలో ప్రయాణించే అభ్యర్థులకు ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, వారితో పాటు వచ్చే తల్లిదండ్రులు ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రైవేట్ వాహనాల ఖర్చులను నివారించడానికి ఈ ప్రత్యేక రైలు సర్వీసును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు సూచించారు.