తెలంగాణలో ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ : సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి నదీ జలాల వినియోగం, దానిపై తలెత్తిన వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అన్ని అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సమగ్రంగా ఒకరోజు చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని, ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కరలేదని పునరుద్ఘాటించారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రితో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ నీటి హక్కుల విషయంలో శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నామన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముందుకు వెళుతున్నామని చెప్పారు. అవసరమైన నిధులను సమీకరిస్తున్నామని వెల్లడించారు.
చర్చలతోనే పరిష్కారం
'ఎంతటి జఠిలమైన సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారమవుతుందని బలంగా విశ్వసిస్తా. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతూ శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. మాకు ఎలాంటి బేషజాలు లేవు. అధికారుల స్థాయిలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చల్లో తేలకపోతే కేంద్ర ప్రభుత్వం వద్ద, లేదా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల వద్ద, ట్రిబ్యునళ్ల ముందు లేదా సుప్రీంకోర్టు వరకు ఏదైనా దశల వారిగా వెళ్లాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ నీటి హక్కులను కాపాడే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కరలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నీటి హక్కుల విషయంలో అనవసరమైన గందరగోళానికి గురిచేయొద్దన్నారు. సహేతుకమైన విమర్శలు చేయాలని చెప్పారు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలపై హక్కులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
గోదావరి నదిపై ప్రాజెక్టులను పూర్తి చేసుకుని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనవసరమైన వివాదాలు, గందరగోళపరిచే విమర్శల వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, తెలంగాణ ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ విధానపరమైన లోపాలు, ఆలోచనల కారణంగానో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైనట్టుగా వెల్లడించారు.
రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి
'గడిచిన పదేళ్లలో చిత్తశుద్ధితో ప్రాజెక్టులను పూర్తి చేసి 967 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చుకుని ఉంటే, వరద జలాలపైనా, వాటా నీటిని తరలించడానికి అవకాశం ఉండే. 2001 లో మొదలైన దేవాదుల రెండు దశాబ్దాలు దాటినా ఇంకా సాగుతూనే ఉంది. ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు నిధుల సమస్య వచ్చింది. రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉండటం వల్ల అవసరమైన నిధులు విడుదల చేయాలంటే కొరత ఉంది. అందుకే సమీక్షించి వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రతిపక్షం సూచనలు ఇవ్వాలి
ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇప్పటికే అంచనాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విధానానికి ముగింపు పలకాలన్నారు. సవరించిన అంచనాలను సవరించి మంత్రివర్గం ఆమోదంతో పనులను వెంటనే పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. తుమ్మడిహెట్టి నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులపైన పూర్తిస్థాయి సమీక్ష చేసి వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. కాళేశ్వరం నుంచి చుక్కనీటిని ఎత్తిపోయకుండానే తెలంగాణలో అత్యధిక దిగుబడి సాధించామన్నారు.
గోదావరి, కృష్ణా జలాలపై పక్క రాష్ట్రానికి తరలించడానికి సహకరిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆరోపణలు సరికాదని, గోదావరి నదీ జలాలపై శాసనసభలో చర్చ చేద్దామన్నారు. సూచనలు ఇవ్వాలన్నారు. ప్రతిపక్షం ఇచ్చే మంచి సూచనలను స్వీకరిస్తామని తెలిపారు.
అవి తెలంగాణ ప్రజల ఆస్తి
'కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తెలంగాణ ప్రజల ఆస్తి. గాలికి వదిలేయం. ప్రజలకు ఉపయోగపడేలా చేస్తాం. బ్యారేజీలకు సంబంధించి ఆనకట్టలకు సంబంధించి భూమి లోపల ఎమైనా సమస్యలున్నాయా అన్న కోణంలో కూడా విశ్లేషణలు జరగాలి. ఆ ప్రాజెక్టు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారకూడదన్న ఆలోచనతో ఉన్నాం. ఆ తర్వాత ఆ బ్యారేజీలను పునరుద్ధరిస్తాం.' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రత్యేక కార్పస్ ఫండ్
నెల రోజుల్లోపు దేవాదుల పంప్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్చిలో మంత్రివర్గ సమావేశంలో సంబంధిత అంచనాలకు ఆమోదం తెలియజేస్తామని చెప్పారు. శాసనసభ సమావేశాల సమయంలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం గ్రీన్ ఛానెల్‌లో నిధులు మంజూరు చేస్తామని, భూ సేకరణ జాప్యం వల్ల ప్రాజెక్టుల పనులు ఆగడానికి వీలు లేదని స్పష్టం చేశారు. రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరందించే అందించే ప్రణాళికపై నివేదిక రూపొందించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


