House Numbers : కొత్త ఇళ్లకు టెంపరరీ ఇంటి నెంబర్లు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం!

తెలంగాణలో కొత్త ఇళ్లకు టెంపరరీ ఇంటి నెంబర్లు ఇవ్వాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి కారణం జనాభా లెక్కలు. హౌస్ లిస్టింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

Published on: Mar 11, 2026 8:12 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించనున్న 2027 జనాభా లెక్కల గృహ జాబితా దశకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈసారి డిజిటల్‌ జనాభా లెక్కలు జరగనున్నాయి. మే 11 నుంచి హౌస్ లిస్టింగ్ మెుదలవుతుంది. అధికారిక గుర్తింపు సంఖ్యలు లేని ఇళ్లకు ప్రత్యేక సంఖ్యలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కొత్త నిర్మాణాలు, తాత్కాలిక నివాసాలు, గ్రామీణ గృహాలు సహా అన్ని నివాస నిర్మాణాలు గృహ జాబితాలో చేర్చినట్టుగా నిర్ధారించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు జనాభా గణన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడతాయి. యాజమాన్యం లేదా ఏదైనా చట్టపరమైన హక్కులను ఇవ్వవని ఇంటి యజమానులకు తెలియజేయాలని కూడా అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. అవే శాశ్వత ఇంటి నెంబర్లు అనుకోవద్దు.

మొత్తం ఇళ్ల సంఖ్యను ధృవీకరించిన తర్వాత అధికారులు నగరాలు, పట్టణాలు, గ్రామాలలో నిర్మాణాలకు సంఖ్యలు వేయడానికి సన్నాహక పనిని పూర్తి చేయాలి. తరువాత ఇళ్ల నమోదు కోసం ఎన్యూమరేటర్ బ్లాక్‌లను కేటాయించాలి.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లను ప్రత్యేక సంస్థలుగా పరిగణించి జనాభా గణన నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2025లో జీహెచ్ఎంసీ పరిమితులను ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించింది. చుట్టుపక్కల ఉన్న 27 మునిసిపాలిటీలను విలీనం చేయడం ద్వారా దాని వార్డుల సంఖ్యను 150 నుండి 300కి పెంచింది.

రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11, 2026న విస్తరించిన జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ అనే మూడు విభాగాలుగా విభజించి, జనాభా లెక్కల ప్రయోజనాల కోసం సవరించిన సరిహద్దులను గుర్తించాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. అయితే, కేంద్రం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. రాష్ట్రాలలో జనాభా లెక్కల సరిహద్దు నియమాలు ఒకే విధంగా ఉంటాయని, ఎటువంటి మినహాయింపులు ఇవ్వరని పేర్కొంది. ఫలితంగా హైదరాబాద్ జనాభా గణన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించిన పరిమితుల ప్రకారం నిర్వహిస్తారు.

అయితే జనాభా లెక్కల కోసం మున్సిపల్ వార్డుల వారీగా డేటాను సేకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌ల జనాభాను స్వతంత్రంగా వార్డుల వారీగా జనాభా డేటాను తీసుకుని.. అంచనా వేయవచ్చని అధికారులు తెలిపారు. అధికారిక జనాభా లెక్కల గణాంకాలు మాత్రం జీహెచ్ఎంసీ కిందనే విడుదల చేస్తారు.

జనాభా లెక్కల నంబరింగ్ విధానం ప్రకారం.. నంబర్లు లేని ఇళ్లకు లేదా ఇప్పటికే ఉన్న నంబర్లు ఉన్న నిర్మాణాల మధ్య నిర్మించిన కొత్త భవనాలకు 10/1 వంటి సబ్ నెంబర్స్ ఇస్తారు. రాబోయే జనాభా లెక్కింపు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి డిజిటల్‌గా చేస్తున్నారు. కచ్చితమైన మ్యాపింగ్‌ కోసం అన్ని భవనాలను మొబైల్ అప్లికేషన్ ద్వారా జియో-ట్యాగ్ చేస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More