...
...
Next Story

Konda Family vs MLAs : సీఎం రేవంత్‌పై కొండా సుస్మిత కామెంట్స్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీవ్ర ఆగ్రహం! చర్యలకు డిమాండ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎల్పీ వేదికగా మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రజాప్రతినిధులు…. సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Published on: Aug 21, 2026, 13:43:13 IST
Advertisement

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. గురువారం శాసనసభాపక్ష (సీఎల్పీ) కార్యాలయం వేదికగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.

కొండా ఫ్యామిలీపై ఫైర్…

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

"తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదనడం సరికాదు," అని కొండా సురేఖ వైఖరిని ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి వెంటనే ఖండించాల్సిందని అభిప్రాయపడ్డారు. "కొండా సురేఖ గతంలోనూ నోరుజారి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారు. కొండా కుటుంబం మాట్లాడే భాష ఎప్పుడూ పార్టీకి తలనొప్పిగా మారింది. మీ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇలా మాట్లాడే వారిపై ఏఐసీసీ వెంటనే చర్యలు తీసుకోవాలి" అని వారు స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు ఎంతగానో కష్టపడ్డారని ఎమ్మెల్యేలు గుర్తుచేశారు. "పార్టీ, ముఖ్యమంత్రి గురించి ఇలా బహిరంగంగా మాట్లాడటం ముమ్మాటికీ తప్పే. ఏదైనా సమస్య ఉంటే సీఎల్పీ లేదా పీసీసీ సమావేశాల్లో చర్చించాలి. సొంత పార్టీ నేతలే సీఎంకు అండగా నిలవాలి కానీ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బహిరంగంగా తప్పుపట్టడం సరికాదు. మనం ఉన్న చెట్టు కొమ్మను మనమే నరుక్కున్నట్లుగా ఉంది ఈ వైఖరి. సుస్మిత వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బలాన్ని చేకూరుస్తాయి" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… "మా పార్టీలోనే కొండా సురేఖ వెనుక కొందరు గుంట నక్కలు చేరారు. రేవంత్ రెడ్డి రక్తం తాగింది చాలు, సురేఖ వెంటనే పార్టీ నుంచి వెళ్ళిపోవాలి. పార్టీ నుంచి బహిష్కరించక ముందే ఆమె వెళ్లిపోవడం మంచిది. ఏ పార్టీలో ఉన్నా గొడవలు లేకుండా సురేఖ ఉన్నారా? ఒక్క ఎమ్మెల్యేతో అయినా ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయా? కూతురు మాట్లాడుతుంటే వెనుక బ్యానర్‌లో సురేఖ ఫోటో ఉంది.. మళ్లీ ఆ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదనడం విడ్డూరం. ఇంకెన్ని రోజులు ఈ బ్లాక్‌మెయిల్ రాజకీయం నడుపుతారు? మాలాంటి వాళ్లను అవమానిస్తూ రక్తం తాగుతామంటే చూస్తూ ఊరుకోం" అని హెచ్చరించారు.

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు స్పందిస్తూ…. "పిల్ల కాకి కొండా సుస్మిత మాట్లాడిన మాటలు ఆమెవి కావు.. అవి కొండా సురేఖ మాట్లాడించిన మాటలే," అని ఆరోపించారు.

ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, "పార్టీలో కనీస సభ్యత్వం కూడా లేని, అనామకురాలైన కొండా సుస్మిత మా ఎమ్మెల్యేను పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతోంది. రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకించే వారికి కాంగ్రెస్‌లో ఉండే అర్హత లేదు. నోటీసులు ఇస్తే నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని సురేఖ చెబుతున్నారు. ఖండించని పక్షంలో సంబంధం లేదనడం ఎలా కుదురుతుంది? మీ తప్పుడు భాషకు ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోంది. మీరు మాత్రం పదవిని ఎంజాయ్ చేస్తూ పార్టీని బజారున పడేస్తున్నారు" అని మండిపడ్డారు.

ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి ఎవరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe