Weight Loss Drugs : వెయిట్ లాస్ మందుల విక్రయాలపై DCA కొరడా - 43 మెడికల్ షాపులకు నోటీసులు! ఈ సూచనలు తెలుసుకోండి
Telangana DCA Raids : బరువు తగ్గించే ఔషధాల అక్రమ విక్రయాలపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా 43 మెడికల్ షాపులపై దాడులు నిర్వహించింది.
Telangana DCA Raids : బరువు తగ్గించే ఔషధాలకు పెరుగుతున్న విపరీతమైన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న మెడికల్ షాపులపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) మెరుపు దాడులు నిర్వహించింది. స్పెషలిస్ట్ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రిస్క్రిప్షన్ ఆధారిత వెయిట్ లాస్ మందులను విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభించడం…..తో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 43 మెడికల్ షాపులపై డీసీఏ అధికారులు సోదాలు చేపట్టారు.

ఈ ప్రత్యేక తనిఖీలను ఆగస్టు 14వ తేదీన నిర్వహించినట్లు డీసీఏ వెల్లడించింది. విపరీతంగా అమ్ముడవుతున్న తిర్జెపటైడ్ (Tirzepatide) ఆధారిత ఔషధం 'మౌంజారో' (Mounjaro), అలాగే సెమాగ్లుటైడ్ (Semaglutide) ఆధారిత ఔషధాలైన ఓజెంపిక్ (Ozempic), వెగోవి (Wegovy), రిబెల్సస్ (Rybelsus) లతో పాటు మార్కెట్లోకి వచ్చిన వాటి జెనెరిక్ వర్షన్ల విక్రయాలు, పంపిణీ తీరుపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
తనిఖీల సందర్భంగా సెమాగ్లుటైడ్‌తో కూడిన మల్టీ-డోస్ వయల్స్, ప్రీ-ఫిల్డ్ పెన్నులను అధికారులు నిశితంగా పరిశీలించారు. మార్కెట్లో నకిలీ, నాసిరకం ఉత్పత్తులు చలామణి అవుతున్నాయా? లేదా డ్రగ్ సేల్ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయా? అనే అంశాలపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 43 మెడికల్ షాపుల్లో తీవ్ర వ్యత్యాసాలు…. అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఉల్లంఘనలు ఇవే…
- నిపుణులైన వైద్యుల రశీదు (ప్రిస్క్రిప్షన్) లేకుండానే బరువు తగ్గించే శక్తివంతమైన మందులను నేరుగా విక్రయించడం.
- వినియోగదారులకు ఔషధాలు విక్రయించినప్పుడు బిల్లులు జారీ చేయకపోవడం, కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించకపోవడం.
- చట్ట ప్రకారం మెడికల్ షాపులో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణలోనే మందులు ఇవ్వాల్సి ఉండగా…. వారి గైర్హాజరులోనే ఔషధాలు పంపిణీ చేయడం.
- ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడం మరియు డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ రూల్స్ కింద పేర్కొన్న ఇతర నిబంధనలను పాటించకపోవడం.
ఈ అక్రమాలపై తీవ్రంగా స్పందించిన డీసీఏ…. ఉల్లంఘనలకు పాల్పడిన 43 మెడికల్ షాపులకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 'డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్, 1940', దాని నియమావళి ప్రకారం సదరు షాపులపై కఠినమైన చట్టపరమైన, నియంత్రణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
కీలక సూచనలు…
షుగర్ వ్యాధి నియంత్రణతో పాటు బరువు తగ్గడానికి ఉపయోగించే ఇంజెక్షన్లు, నోటి మాత్రలకు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ పెరిగింది. అయితే ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని అనధికారిక మార్గాల ద్వారా నకిలీ లేదా ప్రమాదకరమైన నాసిరకం ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డీసీఏ ప్రజలకు పలు సూచనలు చేస్తూ అప్రమత్తం చేసింది.
- బరువు తగ్గించే ప్రిస్క్రిప్షన్ మందులను సొంతంగా (సొంత వైద్యం) ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని, కేవలం అర్హత కలిగిన డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉపయోగించాలని హెచ్చరించింది.
- ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్టులు, అవసరమైన సందర్భాల్లో కార్డియాలజిస్టులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే ఈ మందులు తీసుకోవాలి.
- చెల్లుబాటు అయ్యే డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో కేవలం లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాలి.
- అనధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు లేదా నిరూపితం కాని విక్రేతల నుంచి బరువు తగ్గించే మందులను కొనుగోలు చేయవద్దని హెచ్చరించింది. అలా కొనుగోలు చేసే ఉత్పత్తులు నకిలీవి, నాసిరకం లేదా ప్రాణానికే ప్రమాదకరమైనవిగా మారే అవకాశం ఉందని డీసీఏ స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

