రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచే సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 240 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (PACS) ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న సంఘాలను పునర్వ్యవస్థీకరించేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని వ్యవసాయ, సహకార శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మెమోను జారీ చేసింది.

రాష్ట్రంలోని సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు ఈ మెమో ద్వారా ప్రభుత్వం పూర్తి అధికారాలు కల్పించింది. వర్తించే చట్టాలు, నిబంధనలకు లోబడి కొత్త సంఘాల ఏర్పాటు…. పాత వాటి పునర్వ్యవస్థీకరణకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో రైతుల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది.
రైతులకు చేరువ కానున్న సేవలు
ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ, పంట రుణాల మంజూరు, ధాన్యం కొనుగోలు వంటి సేవలు మరింత చేరువ కానున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే 240 ప్యాక్స్‌ల వల్ల ఇప్పటివరకు దూర ప్రాంతాలకు వెళ్లి సేవలు పొందుతున్న రైతులకు ప్రయాణ భారం తగ్గనుంది. పాత సంఘాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనా సౌలభ్యం పెరిగి, సహకార వ్యవస్థ మరింత పారదర్శకంగా పనిచేసే అవకాశం ఏర్పడుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల్లో ఈ కొత్త సహకార కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రాంతాలను కూడా ప్రభుత్వం గుర్తించింది. త్వరలోనే వీటి ఏర్పాటుకు సంబంధించిన చర్యలు కూడా షురూ అయ్యే అవకాశం ఉంది.