గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 : రేపట్నుంచే మొదటి విడత 'నామినేషన్లు' - అమల్లోకి ఎన్నికల కోడ్

రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నగారా మోగింది. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేస్తారు. అయితే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది.

Published on: Nov 26, 2025, 07:54:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించటంతో పాటు ఆయా రోజుల్లోనే ఫలితాలను కూడా ప్రకటిస్తారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం…. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు.పలు కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించటం లేదు.

రేపట్నుంచే నామినేషన్లు…

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నవంబర్ 27 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యులు వారి నామినేషన్లను సమర్పించవచ్చు. నవంబర్ 29వ తేదీ వరకు వీటిని స్వీకరిస్తారు.

నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. వీటిపై డిసెంబరు 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ ఉంటుంది. ఇక అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచి ఎన్నికను సైతం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు తుది ఫలితాలను ప్రకటిస్తారు.

  • తొలి దశలో 4,200 సర్పంచ్‌ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు ఉంటాయి.
  • రెండో విడతలో భాగంగా 4,333 సర్పంచ్‌ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ ఉంటుంది.
  • మూడో విడతలో 4,159 సర్పంచ్‌ స్థానాలు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు.

అమల్లోకి ఎన్నికల కోడ్…

సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రావటంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పోలీసులు, అబ్కారీ శాఖ వాళ్లు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే వాటిని సీజ్‌ చేస్తారు.

తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు, ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. అత్యవసర అవసరమైన, ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకుని అధికారులకు చూపాలి. తనిఖీల సమయంలో చూపలేకపోయినా.. తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More