ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త - రాయితీలతో పాటు కొత్తగా డీలక్స్‌ పాస్‌లు! నేటి నుంచే అమలు, పూర్తి వివరాలు

రోజువారీ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. నెలవారీ సీజన్‌ టికెట్లపై (MST) మహిళలు, పురుషులకు భారీ రాయితీలతో పాటు డీలక్స్ పాస్‌లు…. ఆదివారాల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది.

Published on: Nov 14, 2026, 09:38:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రోజువారీ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు అందించింది. సామాన్యులు, ఉద్యోగులు, విద్యార్థుల ప్రయాణాన్ని మరింత పొదుపుగా, సౌకర్యవంతంగా మార్చేందుకు నెలవారీ సీజన్‌ టికెట్ పథకంలో సరికొత్త రాయితీలు, అదనపు సదుపాయాలను ప్రకటించింది. శుక్రవారం ఆర్టీసీ అధికారులు వెల్లడించిన ఈ కొత్త నిబంధనలు శనివారం(నేటి) నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తున్నాయి.

నెలవారీ రూట్‌పాస్‌లపై రాయితీలు - ఆర్టీసీ ప్రకటన
నెలవారీ రూట్‌పాస్‌లపై రాయితీలు - ఆర్టీసీ ప్రకటన

సగం ధరకే డీలక్స్ పాస్‌లు…..

ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. అయితే డీలక్స్, మెట్రో, రాజధాని బస్సుల్లో మహిళలు కూడా టికెట్ లేదా నెలవారీ పాస్ తీసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీని ప్రవేశపెట్టింది.

ఇకపై మహిళలు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల నెలవారీ రూట్ పాస్ కోసం కేవలం 15 రోజుల ప్రయాణ ఖర్చును చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు హైదరాబాద్-వరంగల్ రూట్‌లో ప్రయాణించే మహిళలకు పాస్ ధర దాదాపు సగానికి తగ్గనుంది. మరోవైపు…. పురుషులకు 20 రోజుల ఖర్చుతోనే నెలవారీ పాస్ జారీ చేయనున్నారు.

కొత్తగా డీలక్స్ నెలవారీ పాస్….

డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లో నిత్యం ప్రయాణించే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా కొత్త 'డీలక్స్ నెలవారీ సీజన్‌ టికెట్'ను అందుబాటులోకి తెచ్చింది.

  • ఇప్పటివరకు గరిష్టంగా 50 కిలోమీటర్ల దూరానికి మాత్రమే నెలవారీ పాస్‌లు ఇచ్చేవారు. ఇకపై ఆ నిబంధనను ఎత్తివేసి, ఎంత దూరానికైనా నెల పాస్ తీసుకునే వెసులుబాటు కల్పించారు.
  • పాస్ ధరలను మరింత తగ్గించే ఉద్దేశంతో… ఇప్పటివరకు 25 రోజులకు లెక్కిస్తున్న టోల్‌ప్లాజా ఛార్జీలను ఇకపై 20 రోజులకు మాత్రమే లెక్కించనున్నారు.

సండే ఉచిత ప్రయాణం….

నెలవారీ సిటీ బస్ పాస్ ఉన్న ప్రయాణికులకు ఆర్టీసీ మరో బోనస్ ప్రకటించింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ నగరాల్లో నెలవారీ సిటీ పాస్ కలిగిన వారు ప్రతి ఆదివారం అన్ని కేటగిరీల సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, ఈ వెసులుబాటు ఇతర ప్రభుత్వ సెలవు దినాలకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు వర్తించదు.

నెల పాస్ ఉన్నవారు అత్యవసర సమయాల్లో పైశ్రేణి బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా ఆర్టీసీ 'కాంబి టికెట్' సదుపాయాన్ని తెచ్చింది. పాస్ హోల్డర్లు ప్రతి ప్రయాణానికి అదనంగా రూ. 20 చెల్లించి కాంబి టికెట్ తీసుకుంటే ఈ కింది ప్రయోజనాలు పొందవచ్చు….

  • పల్లెవెలుగు నెల పాస్ ఉన్న పురుషులు ఎక్స్‌ప్రెస్, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
  • ఎక్స్‌ప్రెస్ నెల పాస్ ఉన్నవారు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వీలుంటుంది. (పల్లెవెలుగు పాస్‌తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణానికి అనుమతి లేదు).

ప్రయాణికులు ఒకేసారి ఎక్కువ కాలం పాస్ తీసుకునేలా ఆర్టీసీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. రెండు నెలల సీజన్‌ టికెట్ తీసుకుంటే 5 రోజులు, మూడు నెలల పాస్ తీసుకుంటే అదనంగా 10 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాకుండా, పాస్ హోల్డర్లు తమ నిర్ణీత మార్గం కాకుండా తెలంగాణలో ఎక్కడికైనా సూపర్ లగ్జరీ లేదా ఆపై తరగతి బస్సుల్లో ప్రయాణిస్తే…. బేసిక్ ఛార్జీపై 10 శాతం రాయితీ పొందవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More