తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ - ఒకే రోజులో యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, పోచంపల్లి యాత్ర!
Telangana Tourism Package 2026 : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) సరికొత్త 'వన్-డే పిల్‌గ్రిమేజ్ అండ్ హెరిటేజ్ టూర్ ప్యాకేజీ'ని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, కొలనుపాక, పోచంపల్లి సందర్శించేలా ఈ టూర్‌ను డిజైన్ చేశారు.
Telangana Tourism Package 2026 : రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పర్యాటక ప్రాంతాలను ఒకే రోజులో సందర్శించాలనుకునే భక్తులు, పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ఒక అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

"వన్-డే పిల్‌గ్రిమేజ్ అండ్ హెరిటేజ్ టూర్" పేరుతో ప్రవేశపెట్టిన ఈ సరికొత్త ప్యాకేజీ ద్వారా రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, చారిత్రక, చేనేత వారసత్వాన్ని పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతంగా, సరసమైన ధరలోనే అందించడమే లక్ష్యంగా సంస్థ అడుగులు వేసింది.
ఈ ప్రత్యేక టూర్ సర్క్యూట్ "హైదరాబాద్ – యాదగిరిగుట్ట – శిల్పారామం – కొలనుపాక జైన దేవాలయం – స్వర్ణగిరి దేవాలయం – పోచంపల్లి – హైదరాబాద్" మార్గంలో సాగుతుంది. ఒకే రోజు ప్రయాణంలో అటు దైవదర్శనం, ఇటు చరిత్ర, కళలు, సాంప్రదాయ చేనేత నైపుణ్యాలను వీక్షించేలా ఈ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు.
టూర్ ప్యాకేజీ షెడ్యూల్….
ఈ ప్రయాణం హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ ఉదయం ప్రారంభమవుతుంది. పర్యాటకులు తమకు అనుకూలమైన బోర్డింగ్ పాయింట్ల వద్ద బస్సు ఎక్కవచ్చు. ఉదయం 7:00 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ వద్ద, ఉదయం 7:15 గంటలకు బేగంపేటలోని పర్యాటక్ భవన్ వద్ద…. అలాగే ఉదయం 7:30 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్వో (CRO) ఆఫీస్ వద్ద పర్యాటకులను తీసుకుంటారు. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మొట్టమొదట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారి దివ్య దర్శనం అనంతరం యాదగిరిగుట్టలోని హరిత హోటల్‌లో అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) ఏర్పాటు చేస్తారు.
అక్కడి నుంచి గ్రామీణ కళలు, హస్తకళల ఉట్టిపడే యాదగిరిగుట్ట శిల్పారామాన్ని సందర్శిస్తారు. అనంతరం దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొలనుపాక జైన దేవాలయానికి పర్యాటకులను తీసుకెళ్తారు. ఆ తర్వాత భువనగిరిలోని వివేరా హోటల్‌లో రుచికరమైన మధ్యాహ్న భోజనం (లంచ్) ఉంటుంది. భోజనం ముగిశాక, ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందుతున్న అద్భుతమైన స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ప్రయాణమవుతారు. చివరిగా….. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇక్కత్ చేనేత వస్త్రాల పురిటిల్లు భూదాన్ పోచంపల్లిని సందర్శిస్తారు. అక్కడ హరిత హోటల్‌లో హై-టీ (స్నాక్స్, టీ) ముగించుకుని, రాత్రి 7:30 గంటల సమయానికి తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో ఈ విహారయాత్ర ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ కింద పర్యాటకులకు ఏసీ మినీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సౌత్ ఇండియన్ వెజ్ భోజనం, సాయంత్రం హై-టీతో పాటు ఆయా దేవాలయాలలో దర్శన ఏర్పాట్లు అన్నీ ఈ ప్యాకేజీలోనే భాగమై ఉంటాయి.
టికెట్ ధరల వివరాలు:
- పెద్దలకు (Adult): రూ. 2,070/-
- పిల్లలకు (Child): రూ,770/
ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్ర, తెలంగాణ ఘనమైన చేనేత సంప్రదాయాల సమ్మేళనంగా రూపొందించిన ఈ ప్రత్యేక టూర్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ టూరిజం శాఖ యాత్రికులను, కుటుంబాలను ఆహ్వానిస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

