AP Hotel Menu Rates : గ్యాస్ ధరల ఎఫెక్ట్...! ఏపీ హోటల్స్‌లో ఫుడ్ ధరలు పెంపు
AP Hotel Menu Rates : కమర్షియల్ గ్యాస్ ధర ఒక్కసారిగా రూ.993 పెరగడంతో ఆంధ్రప్రదేశ్ హోటల్ యజమానులు బెంబేలెత్తుతున్నారు. ఇన్-పుట్ ఖర్చులు భరించలేక మెనూ ధరలను 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది.
AP Hotel Menu Rates : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడిపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల పెరుగుదల సెగ విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్‌లోని హోటల్ పరిశ్రమకు గట్టిగా తగిలింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే (19 కిలోల) గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడంతో, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెంచడం మినహా తమకు మరో మార్గం లేదని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

శుక్రవారం (మే 1) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం.. హైదరాబాద్ వంటి నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ.993 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఒక సిలిండర్ ధర దాదాపు రూ.3,315 కు చేరుకుంది. కేవలం ఈ మూడు నెలల కాలంలోనే గ్యాస్ ధరలు సుమారు రూ.1,303 మేర పెరగడం ఆతిథ్య రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులే కాకుండా….. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడుతున్న వారు కూడా అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది.
10 శాతం పెంపు….
"మే 1 నుంచి సిలిండర్ ధర భారీగా పెరగడం హోటల్, రెస్టారెంట్ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ. ముడి పదార్థాల ఖర్చులు విపరీతంగా పెరగడంతో యజమానులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. అందుకే మెనూ ధరలను 10 శాతం వరకు పెంచాలని నిర్ణయించాం" అని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ వీ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం గ్యాస్ ధరలే కాకుండా, హోటల్ నిర్వహణకు కీలకమైన వంట నూనెలు, పప్పుధాన్యాలు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పొద్దుతిరుగుడు నూనె ధరలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఖర్చు పెరగడం వల్ల టేక్ అవే మరియు డెలివరీ సర్వీసులు భారంగా మారాయి. రోజువారీ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండాలంటే ధరల పెంపు తప్పనిసరి అని హోటల్ యజమానులు వాదిస్తున్నారు.
ప్రస్తుత సంక్షోభం నుండి ఆతిథ్య రంగాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ కోరింది. పన్ను రాయితీలు లేదా సబ్సిడీలు అందించి పరిశ్రమను ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. అలాగే….. పెరిగిన ధరల పట్ల వినియోగదారులు సహకరించాలని, నాణ్యమైన సేవలను అందించడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కస్టమర్లను తెలిపింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

