...
...
Next Story

South Coastal Railway Zone : జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ - గెజిట్ విడుదలపై కీలక ప్రకటన

South Coastal Railway Zone : విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కానుంది. జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.

Published on: Apr 29, 2026, 07:10:44 IST
Advertisement

South Coastal Railway Zone : ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coastal Railway Zone) కార్యరూపం దాల్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు.

విశాఖపట్నం
విశాఖపట్నం

విశాఖపట్నంలో జరిగిన గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన….. రాష్ట్ర రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధించి పలు కీలక విషయాలను పంచుకున్నారు.

త్వరలోనే గెజిట్ - కేంద్రమంత్రి

కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుందని మంత్రి స్పష్టం చేశారు. "దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి జూన్ 1, 2026ని అమలు తేదీగా నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పరిపాలనను బలోపేతం చేసే దిశగా ఇది ఒక చారిత్రాత్మక అడుగు" అని ఆయన పేర్కొన్నారు.

రైల్వే ఆధునీకరణలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని రైల్వేశాఖ మంత్రి వైష్ణవ్ ప్రశంసించారు. రాష్ట్రంలోని రైల్వే నెట్‌వర్క్ అంతటా 100 శాతం విద్యుదీకరణ ప్రక్రియ పూర్తయిందని…. మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల సరసన ఏపీ నిలిచిందని ఆయన వెల్లడించారు. ఈ మైలురాయి వల్ల రైళ్ల వేగం పెరగడంతో పాటు, కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని వివరించారు.

గడిచిన కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచినట్లు మంత్రి గుర్తుచేశారు. కేవలం జోన్ ఏర్పాటు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, పోర్టులు మరియు పారిశ్రామిక కేంద్రాలకు రైలు అనుసంధానం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

వీఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు , కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సందర్శించారు. కొత్త జోన్ కార్యకలాపాలు, ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ సహా, ఏపీలోని ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

నూతనంగా ఏర్పాటు అవుతోన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో మరికొన్ని సెక్షన్లు విలీనం చేస్తూ కొన్ని పాలనా పరమైన మార్పులు చేయాలని రైల్వే మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ రాష్ట్ర పరిధిలోకి వచ్చే అరకు - కొత్తవలస సెక్షన్, కర్నూలు - డోన్ లను కొత్త జోన్‌లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు. రైల్ రూట్ డెన్సిటీ లేని కారణంగా లాజిస్టిక్స్ హబ్ గా మారాలని ఏపీ నిర్దేశించుకున్న లక్ష్యాలకు ఇబ్బంది కలుగుతున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాల హింటర్ ల్యాండ్ ను కనెక్ట్ చేయాలని కోరారు.

రైల్వే జోన్ ఏర్పాటుపై 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డీపీఆర్‌కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్‌ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఎంతో కీలకమైన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాకపోవడంతో అధికారిక కార్యకలాపాలు అమల్లోకి రాలేదు. అయితే జూన్ 1 నుంచి అమల్లోకి వస్తూ గెజిట్ విడుదల కానుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe