...
...
Next Story

APSRTC : ఆర్టీసీలో ప్రైవేటీకరణ లేదు... ఉద్యోగ భద్రతపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రవాణా శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ప్రకటన విడుదల చేశారు. సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదని భరోసా ఇచ్చారు.

Published on: Jul 9, 2026, 19:31:18 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందంటూ గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనే లేదని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) కృష్ణబాబు స్పష్టం చేశారు. కేవలం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామే తప్ప, సంస్థను ప్రైవేట్ పరడం చేయడం లేదని ఆయన వివరించారు.

ప్రైవేటీకరణ లేదు…..

ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

"ఆర్టీసీ ప్రైవేటీకరణ కావడం లేదు. సంస్థ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం లేదు. ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్నే మనం కూడా ఏపీలో అనుసరిస్తున్నాం," అని కృష్ణబాబు వివరించారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'పీఎం ఈ-బస్ సేవా' పథకం కింద ఏపీఎస్ఆర్టీసీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. రాష్ట్రంలోని 11 ప్రధాన నగరాల్లో ఈ పర్యావరణ హిత బస్సులను నడపనున్నారు. ఈ పథకం కింద వచ్చే బస్సుల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే 'సిఇఎస్ఎల్' (CESL) ద్వారా కామన్ టెండర్ నిర్వహించి ఖరారు చేసింది.

గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) కింద వెట్ లీజు పద్ధతిలో ఈ టెండర్లు జరిగాయి. దీని ప్రకారం బస్సుల నిర్వహణతో పాటు డ్రైవర్లను కూడా సదరు ప్రైవేట్ సంస్థే సమకూరుస్తుంది. ఈ విధానం కేవలం కేంద్ర పథకం ద్వారా వచ్చే బస్సులకు మాత్రమే వర్తిస్తుందని…. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి అమల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్ర స్కీం ద్వారా నడిచే ఎలక్ట్రిక్ బస్సులకు కేంద్ర ప్రభుత్వం కిలోమీటరుకు రూ. 24 చొప్పున గ్రాంట్ ఇస్తుందని, దీనివల్ల ఆర్టీసీకి మొత్తంగా రూ. 1,774 కోట్ల మేర ప్రోత్సాహక నిధులు లభిస్తాయని కృష్ణబాబు వెల్లడించారు.

"రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే ఎలక్ట్రిక్ బస్సుల కోసం వెట్ పద్ధతిలో కాకుండా, 'డ్రై లీజ్' పద్ధతిలో టెండర్లు పిలిచే అంశంపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాం. డ్రై విధానంలో టెండర్లు పిలిస్తే ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లే నడుపుతారు. జనరల్ మెయింటెనెన్స్ కూడా మన సిబ్బందే చూసుకుంటారు" అని ఆయన వివరించారు. ఆర్టీసీకి చెందిన ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే ప్రసక్తే లేదని, సిబ్బంది అందరికీ పూర్తి ఉద్యోగ భద్రత ఉంటుందని కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.

ఆ వార్తల్లో నిజం లేదు - కృష్ణబాబు, స్పెషల్ సీఎస్

ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ సంస్థలకు రాసిస్తున్నారనే వార్తల్లో అస్సలు నిజం లేదని కృష్ణబాబు కొట్టిపారేశారు. ఈ-బస్సుల నిర్వహణ కోసం ఏపీఎస్ఆర్టీసీ డిపోలను ఈ-డిపోలుగా ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఒప్పంద కాలంలో కేవలం గ్యారేజ్ స్థల నిర్వహణ, ఛార్జింగ్ సదుపాయాల కోసం మాత్రమే ఆర్టీసీ స్థలాలను వాడుకుంటాయని, అంతేకాని ఆస్తులను ఎవరికీ విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం చేయడం లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం విద్యాధరపురం, గుంటూరు -2, నెల్లూరు-2 వంటి డిపోలలో ఎలక్ట్రిక్, సివిల్ పనులు జరుగుతున్నందున….. అక్కడి కొందరు ఉద్యోగులను తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు పంపించామని, ఈ విషయంలో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది జీతాలు, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి వంటి ఉచిత ప్రయాణ పథకాల ఆర్థిక భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని ఆయన వివరించారు. ఆర్టీసీపై వచ్చే ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, కార్మికులను ఆయన కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks