...
...
Next Story

Cyclone Arnab : అర్నబ్ తుపాను.. విమానాలు, రైళ్లు రద్దు.. అనవసరంగా బయటకురావొద్దు!

ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈదురగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. ప్రజలకు అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Published on: Oct 27, 2026, 20:14:26 IST
Advertisement

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన కొద్ది గంటల్లో గంటకు 18 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుపాను, తీవ్ర రూపం దాల్చి తీర ప్రాంత జిల్లాలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి ఈ తుపాను కాకినాడకు 140 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 170, మచిలీపట్నానికి 230, బాపట్లకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

అర్నబ్ తుపాను
అర్నబ్ తుపాను

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో అర్నబ్ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో ఈదురుగాలుల వేగం గంటకు 125 నుండి 135 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.

తుపాను ప్రభావంతో రాబోయే కొద్ది గంటల్లో కోనసీమ, కాకినాడ, పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

అర్నబ్ తుపాను తీవ్రతపై ఏపీ హోంమంత్రి అనిత స్పందిస్తూ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. రాబోయే 48 గంటలపాటు రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప రాబోయే 48 గంటల పాటు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాథమిక ధ్యేయమని స్పష్టం చేశారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 24/7 అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు అధికారుల హెచ్చరికలను పాటించాలని కోరారు.

విమానాలు రద్దు

విజయవాడ విమానాశ్రయం మంగళవారం నాటి 6 విమాన సర్వీసులను రద్దు చేయగా, బుధవారం నాటి ఇండిగో సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఢిల్లీ విమానంతో పాటు ఫ్లై91 సంస్థకు చెందిన రెండు హైదరాబాద్ సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.

7 మేము రైళ్లు రద్దు

దక్షిణ తీర రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా విజయవాడ, గుంటూరు, రేపల్లె సెక్టార్లలో నడిచే 7 మేము ప్యాసింజర్ రైళ్లను (అక్టోబర్ 27, 28 తేదీల్లో) రద్దు చేసినట్లు గుంటూరు రైల్వే డివిజన్ వెల్లడించింది. అక్టోబర్ 27న రద్దయినది రైలు నంబర్ 67247 (నరసాపూర్ – గుంటూరు).

అక్టోబర్ 28న రద్దయి రైళ్లు

రైలు నంబర్ 67229 (విజయవాడ – గుంటూరు)

రైలు నంబర్ 67223 (గుంటూరు – రేపల్లె)

రైలు నంబర్ 67224 (రేపల్లె – తెనాలి)

రైలు నంబర్ 67249 (గుంటూరు – రేపల్లె)

రైలు నంబర్ 67250 (రేపల్లె – గుంటూరు)

రైలు నంబర్ 67248 (గుంటూరు – విజయవాడ)

ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అధికారిక రైల్వే యాప్‌లు లేదా స్టేషన్ విచారణ కేంద్రాల ద్వారా రైళ్ల నడిచే స్థితిని తెలుసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks