ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్ - ఈ 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తుఫానుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ కేంద్రం ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో నెలకొన్న అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశముంది.
ఎక్కడెక్కడ వర్ష సూచన ఉంది?
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర కోస్తాంధ్రతో పాటు యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల గురువారం భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. వీటితో పాటు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం నాటికి ఈ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శుక్రవారం కూడా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ పరిధిలో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
బలమైన ఈదురుగాలుల హెచ్చరిక
శనివారం రోజున కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ బలమైన ఉపరితల గాలుల ప్రభావం సెప్టెంబర్ 14 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొనసాగనుంది. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

