ఏపీ, తెలంగాణలో వణికిస్తున్న చలి.. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు వాతావరణం మరింత చలిగా ఉండనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరించింది.

Published on: Dec 22, 2025, 17:00:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పడిపోనున్నాయి. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఏపీలో కోస్తా, రాయలసీమ, యానంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా నమోదుకానున్నాయి.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు
పడిపోతున్న ఉష్ణోగ్రతలు

అల్లూరి, పార్వతీపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు‌ నమోదవుతున్నాయి. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అరకు, పాడేరు, చింతపల్లిలో 4 నుంచి 7 డిగ్రీల మధ్యలోనే ఉంటున్నాయి.

తెలంగాణలో చలి

ఇక తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌లో నమోదైంది. చలిగాలుల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో కనిష్టంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని రెడ్డి పల్లెలో 6.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వగా.. 17 జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 7 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా అర్లిలిలో 8.3 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా నవాబుపేటలో 8.7 డిగ్రీలు, సిద్దిపేటలోని పోతారెడ్డిపేటలో 9.5 డిగ్రీలు, మెదక్ జిల్లా దామరంచలో 9.5 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డిలో 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్, శివారు ప్రాంతాలతో సహా అనేక చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. భారత వాతావరణ శాఖ ఏడు జిల్లాలకు శీతల గాలుల హెచ్చరిక జారీ చేసింది. IMD బులెటిన్ ప్రకారం, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఏకాంత ప్రాంతాల్లో చలిగాలులు ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 26 వరకు కనిష్ట ఉష్ణోగ్రత 5-10 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్న ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, పెద్దపల్లె, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన 11 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

కొన్ని ప్రదేశాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. రాబోయే 24 గంటలు హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More