South Coastal Railway Zone : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ - జూన్ 1 నుంచి ప్రారంభం..! గెజిట్ విడుదల

South Coastal Railway Zone Gazette : విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కానుంది. జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు రైల్వే బోర్డు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Published on: May 5, 2026, 11:33:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

South Coastal Railway Zone Gazette : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్తగా ఏర్పడిన 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' కార్యకలాపాలపై కేంద్ర రైల్వే బోర్డు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 జూన్ 1 నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా అమల్లోకి రానుంది.

విశాఖపట్నం
విశాఖపట్నం

జూన్ 1 నుంచి కార్యకలాపాలు…

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) మే 4, 2026న ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1989 రైల్వే చట్టంలోని సెక్షన్ 3(4) ప్రకారం… కొత్త రైల్వే జోన్‌గా 'సౌత్ కోస్ట్ రైల్వే' (South Coast Railway)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. జూన్ 1, 2026 నుండి తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని వెల్లడించింది.

  • విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఈ జోన్ పరిధిలోకి పలు కీలక విభాగాలు చేర్చబడ్డాయి.
  • దక్షిణ మధ్య రైల్వే నుంచి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు పూర్తిగా దక్షిణ తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి.
  • రాయగడ డివిజన్‌లో ఇంతకుముందున్న పలాస-ఇచ్ఛాపురం రైల్వే లైన్‌, ఇచ్చాపురం - దువ్వాడ- విజయనగరం రైల్వే లైన్లు విశాఖ డివిజన్‌లోకి వచ్చాయి.
  • నౌపడా- పర్లాకిమిడి- బొబ్బిలి - సాలూరు లైన్లు, సింహాచలం- వడ్లపూడి- విశాఖ జగ్గయ్యపాలెం రైల్వే లైన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేశారు.
  • కోరాపుట్‌-కిరండోల్‌ లైన్‌ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు.
  • రాయగడలో ఏర్పాటు చేసే కొత్త డివిజన్‌లో కోరాపుట్–సింగపూర్ రోడ్, కొత్తవలస–కిరండూల్, కునేరు–థెరువలి, గుణుపూర్–పర్లకిమిడి వంటి మార్గాలు చేరనున్నాయి. ఈ డివిజన్ మొత్తం 696 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది.
  • అదనంగా పలాసా–ఇచ్ఛాపురం మార్గాన్ని ఖుర్దా రోడ్ డివిజన్ నుంచి విశాఖ డివిజన్‌కు బదిలీ చేశారు.
  • ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు.
  • వీఎంఆర్‌డీఏ డెక్‌లోని 2 అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్వే జీఎం తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇటీవలనే ఈ ఆఫీస్ ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సందర్శించారు.
  • సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు అలాగే కొనసాగుతాయి. అయితే విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఇకపై విశాఖపట్నం కేంద్రంగా ఉన్న దక్షిణ తీర రైల్వే జోన్ ఆధీనంలోకి వస్తాయి.
  • ఈ మార్పుతో రాష్ట్రంలోని రైల్వే సరిహద్దుల్లో మార్పులు రానున్నాయి. ఈ జోన్‌ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది. ఇతర సిబ్బందిని కూడా సర్దుబాటు చేస్తున్నారు.

రైల్వే జోన్ ఏర్పాటుపై 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డీపీఆర్‌కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్‌ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఎంతో కీలకమైన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాకపోవడంతో అధికారిక కార్యకలాపాలు అమల్లోకి రాలేదు. అయితే జూన్ 1 నుంచి అమల్లోకి వస్తూ గెజిట్ విడుదలైన నేపథ్యంలో…. అధికారికంగా కార్యక్రమాలు షురూ అవుతాయి.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రైల్వే జోన్ డిమాండ్ నెరవేరడం పట్ల ఉత్తరాంధ్ర వాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నో ఏళ్ల కల - మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

రైల్వే జోన్ పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడం ఏపీ ప్రజల చిరకాల స్వప్నం. సీఎం చంద్రబాబు కృషితోనే ఇది సాకారమైంది జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కావడంతో.. రాష్ట్ర రవాణా రంగంలో నవశకానికి నాంది పలకనుంది. ఎన్నో ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కల నెరవేరుస్తూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావడం చారిత్రాత్మక నిర్ణయం”

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది?

సమాధానం: కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, జూన్ 1, 2026 నుండి ఈ జోన్ అధికారికంగా పనిచేయడం ప్రారంభిస్తుంది.

ప్రశ్న: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం (HQ) ఎక్కడ ఉంటుంది?

సమాధానం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం దక్షిణ తీర రైల్వే జోన్ ప్రధాన కేంద్రంగా ఉంటుంది.

ప్రశ్న: వాల్తేరు డివిజన్ ఏమైంది?

సమాధానం: వాల్తేరు డివిజన్‌ను విభజించారు. ఒక భాగం విశాఖపట్నం డివిజన్‌గా మారి కొత్త జోన్‌లో చేరింది, మిగిలిన భాగం రాయగడ డివిజన్‌గా ఏర్పడి భువనేశ్వర్ జోన్ పరిధిలోకి వెళ్లింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More