AP MPTC ZPTC Results : ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు - పలుచోట్ల ఆసక్తికర గెలుపోటములు! లిస్టులో మాజీ ఎంపీలు
AP Parishad Election Results 2026 : ఆంధ్రప్రదేశ్ పరిషత్ పోరులో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా కొనసాగింది. అయితే పలుచోట్ల ఈ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. జైలు నుంచే నామినేషన్ వేసి గెలవటం… ఒక్క ఓటు మెజారిటీ, ఒకే ఇంట్లో తల్లీకూతుళ్ల విజయం వంటి ఆసక్తికర ఫలితాలు వెలుగుచూశాయి.
AP Parishad Election Results 2026 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పరిషత్ (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తన జోరును చాటుకుంది. మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించగా…. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీని ఇచ్చింది. ఈ ఎన్నికల కౌంటింగ్‌లో కొన్నిచోట్ల అనేక ఊహించని మలుపులు, చిత్రవిచిత్రమైన ఫలితాలు కనిపిచాయి.

చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో కూటమికి గట్టి ఎదురుగాలి వీచింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే థామస్ సొంత మండలమైన కార్వేటినగరంలో జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. దీనితో పాటు వెదురుకుప్పం, ఎస్ఆర్పురం మండలాల్లోనూ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఎస్ఆర్పురం, వెదురుకుప్పం, పెనుమూరు మండలాల్లోని మెజారిటీ ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా విజయం సాధించి పైచేయి సాధించింది.
ఒకే ఇంట్లో రెండు గెలుపులు…..
ఈ పరిషత్ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా పోటీ చేసి విజయం సాధించిన ఘటనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన వీసం నారాయణరావు (నానాజీ) పెదబోదుగల్లం ఎంపీటీసీగా, ఆయన భార్య దేవి రేబాక ఎంపీటీసీగా వైసీపీ తరఫున ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరూ ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందడం విశేషం.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం గ్రామానికి చెందిన తమ్మినేని శ్యామలరావు (మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోదరుడు) కుమార్తె సుజాత తెదేపా తరఫున జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందగా, ఆమె తల్లి భారతమ్మ ఎంపీటీసీగా గెలిచారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. పొనుగుపాటి సత్యనారాయణ వైకాపా అభ్యర్థిగా పలివెల-2 ఎంపీటీసీ స్థానం నుంచి గెలవగా…. ఆయన కుమార్తె చాందిని కొత్తపేట-2 ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం తరఫున విజయం సాధించారు.
ఒక్క ఓటుతో గెలుపు..
పోటీ తీవ్రంగా ఉన్న చోట ఒక్క ఓటు కూడా ఎంత కీలకమో ఈ ఫలితాలు నిరూపించాయి. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఆనందపురం ఎంపీటీసీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన వజ్జిపర్తి పూర్ణమ్మ కేవలం ఒక్క పోస్టల్ ఓటు ఆధిక్యంతో విజయాన్ని అందుకున్నారు. అదేవిధంగా….. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి ఎంపీటీసీ స్థానంలో పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి కొల్లి అరుణకుమారి సైతం ఒక్క ఓటు స్వల్ప ఆధిక్యంతో విజయాన్ని ముద్దాడారు.
జైలు నుంచే నామినేషన్...
తిరుపతి జిల్లా పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానం (ఓపెన్ కేటగిరీ) ఫలితం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివిధ కేసుల కారణంగా గత నెల రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి జైలు నుంచే నామినేషన్ వేశారు. ఆయన భార్య ప్రభావతమ్మ, కుమార్తెలు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి సత్యనారాయణరెడ్డి 1,719 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
మాజీ ఎంపీలు ఓటమి…
గతంలో వైసీపీ ఎంపీలుగా పనిచేసిన పలువురికి ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ కోనసీమ జిల్లా కె.గంగవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు జెడ్పీటీసీ స్థానంలో పోటీ చేయగా, తెలుగుదేశం అభ్యర్థి హిమబిందు 978 ఓట్ల తేడాతో విజయం సాధించి మాధవిని ఓడించారు.
- కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య చివరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతిమంగా బీజేపీ అభ్యర్థిపై కేవలం 63 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు.
- తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తన పట్టును నిలుపుకున్నారు.
- బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో పోటీ చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.ఇక్కడ నుంచి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ (తెదేపా) అభ్యర్థి పాశల నీరజ, బొత్స అనూషపై ఏకంగా 5,136 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
- రాష్ట్రవ్యాప్తంగా కూటమి జోరు ఉంటే… అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌పై వైఎస్సార్సీపీ పట్టు నిలుపుకుంది. జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం వైసీపీ అభ్యర్థులు ఆరు చోట్ల విజయం సాధించారు. గూడెంకొత్తవీధి, చింతపల్లి, పాడేరు, పెదబయలు, డుంబ్రిగూడ, అనంతగిరి స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. దాదాపుగా ఈ జెడ్పీ పీఠం వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

