Summer Special Trains 2026 : వేసవి సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించటంతో పాటు వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్ నుంచి కర్ణాటకలోని బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య ఒక ప్రత్యేక సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.. బిలాస్‌పూర్ - బెంగళూరు కంటోన్మెంట్(ట్రైన్ నంబర్ 08263) మధ్య ప్రత్యేక రైలును నడపనుంది. 2026 జూన్ 12వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మరియు కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రధాన రైల్వే స్టేషన్ల మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
ఏపీ, తెలంగాణలో ఆగే స్టేషన్లు…
ఈ సమ్మర్ స్పెషల్ రైలు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగాప్రయాణిస్తుండటంతో ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ బెంగళూరుకు వెళ్లే ఉద్యోగులు, కుటుంబాలకు ఈ ప్రత్యేక రైలు సర్వీసు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.
ఈ ట్రైన్ సిర్పూర్ కాజగ్ దనర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, మంత్రాలయం రోడ్డు, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలులో ప్రయాణించాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కానీ, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కానీ ముందస్తుగా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.