...
...
Next Story

ఐఎండీ వెదర్ అప్డేట్.. నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్‌లోకి రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని అమరావతి ఐఎండీ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఎండలు, వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి.

Published on: Jun 4, 2026, 05:57:51 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. కేరళకు గురువారం (జూన్ 4) నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని, అక్కడి నుంచి తదుపరి మూడు లేదా నాలుగు రోజుల్లో ఇవి ఆంధ్రప్రదేశ్‌ను తాకవచ్చని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.

ఏపీలోకి నైరుతి రుతుపవనాలు
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు

గతేడాది మే 26నే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. ఈ ఏడాది కూడా జూన్ 1 నాటికే రుతుపవనాలు రాష్ట్రానికి వస్తాయని భావించినప్పటికీ, రుతుపవనాల రాకను అధికారికంగా ప్రకటించడానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు పూర్తిస్థాయిలో అనుకూలించలేదని వాతావరణ నిపుణులు తెలిపారు.

కేరళ నుంచి ఏపీకి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది?

సాధారణంగా కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత, అవి ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోవడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని ఐఎండి అమరావతి శాస్త్రవేత్త ఎస్. కరుణాసాగర్ తెలిపారు. అయితే ఒకవేళ ఏవైనా ప్రతికూల పరిస్థితుల వల్ల ఆలస్యం జరిగితే, రాష్ట్రానికి చేరుకోవడానికి గరిష్టంగా ఏడు రోజుల వరకు కూడా సమయం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, కేరళలో ప్రవేశించిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని ఆయన వివరించారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న ఉక్కపోత.. 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత

మరోవైపు, రాష్ట్రంలో ఎండల తీవ్రత, ఉక్కపోత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం రాష్ట్రంలో ఎక్కడా తీవ్ర వడగాల్పులు నమోదు కాలేదు. అయితే, 20 మండలాల్లో వడగాల్పులు వీచాయి. బుధవారం నాటి అత్యధిక ఉష్ణోగ్రత మార్కాపురం జిల్లాలోని నందనమరెళ్ల గ్రామంలో 44.5 డిగ్రీలుగా నమోదైంది.

గురు, శుక్రవారాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక

ఈ నెలలో రాష్ట్రంలో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. అలాగే ఈ నెలలో 3 నుంచి 4 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈసారి వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా సమానంగా ఉండకపోవచ్చు. రాయలసీమ ప్రాంతంలో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కానీ కోస్తా ఆంధ్ర, ఉత్తర ఆంధ్ర ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు

బుధవారం నాడు విజయనగరం జిల్లాలోని రాజాం పరిధిలో అత్యధికంగా 32 మిమీ వర్షపాతం నమోదైంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం.. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం-మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిశాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe